ఇటీవల సుప్రీం కోర్టులో కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.
వారిలో, జస్టిస్ నాగరత్న భవిష్యత్తులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పదవిని చేపట్టే అవకాశం కూడా ఉందని, అవి చరిత్రలో లిఖించదగ్గ క్షణాలు అవుతాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ, కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వార్త, పలు వార్తా పత్రికల్లో మొదటి పేజీలో చోటు సంపాదించుకుంది.
“జెండర్ ప్రాతినిధ్యం విషయంలో ఇది ఒక చారిత్రక ఘట్టమని” న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అభివర్ణించారు. “ఇవి గర్వించదగ్గ క్షణాలని” అమెరికాలోని భారత రాయబారి అన్నారు. కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ, భారత చరిత్రలో ఇదొక ముఖ్యమైన రోజు అంటూ ట్విటర్లో ప్రశంసలు వెల్లివిరిశాయి. భారతదేశ ఉన్నత న్యాయవ్యవస్థలో ఈ నియామకాలు ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇవి జెండర్ ప్రాతినిధ్యాన్ని పెంచాయన్న మాట వాస్తవమే అయినప్పటికీ దేశవ్యాప్తంగా మొత్తం న్యాయవ్యవస్థలో జెండర్ అసమానతలు తగ్గనంత కాలం తాజా పరిణామాలకు సంబరాలు జరుపుకోవడం తొందరపాటే అవుతుందని విమర్శకులు అంటున్నారు.
సీజేఐగా తొలి మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఇప్పటి నుంచే ఉత్సాహపడడం తొందరపాటేనని, అన్నీ సవ్యంగా జరిగినా, 2027లో, అదీ రిటైర్ కావడానికి ఒక్క నెల ముందు మాత్రమే జస్టిస్ నాగరత్న సీజేఐ పదవిని అలంకరిస్తారని సీనియర్ లాయరు స్నేహ కలిత అన్నారు. “చీఫ్ జస్టిస్‌గా ఒక మహిళా న్యాయమూర్తి తొలిసారిగా బాధ్యతలు స్వీకరించడం చారిత్రక ఘట్టమే, సంబరాలు జరుపుకోవలసిన విషయమే. కానీ అది నామమాత్రపు చర్య మాత్రమే. దాని వలన ఎలాంటి ప్రభావం ఉండదు.’’
’’చీఫ్ జస్టిస్‌గా నియామకం జరిగిన తరువాత, ఆ బాధ్యతలు స్వీకరించి ఆ పదవిలో స్థిరపడడానికి కొంత సమయం పడుతుంది. మొదటి రెండు నెలలు అడ్మినిస్ట్రేటివ్ పనులకే సరిపోతాయి. అలాంటిది ఒక్క నెలలో ఆమె ఏం చేయగలరు? ఒక మహిళ, సీజేఐ అయ్యారని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్పితే మరే లాభం ఉండదు” అని లాయరు కలిత అన్నారు.