బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్‌ తుపాను పశ్చిమబెంగాల్‌లో తీరం తాకటం మొదలైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ తుపాను తీరాన్ని తాకడం మొదలైందని, ఇది 4 గంటల పాటు కొనసాగుతుందని వివరించింది.

తుపాను ఊర్ధ్వ ఉపరితల ప్రాంతం పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించిందని, దిఘా పట్టణానికి తూర్పు ఆగ్నేయాన సుమారు 65 కి.మీ.ల దూరంలో ఇది తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అయితే తుపాను కేంద్రం (Eye of cyclone) ఏ క్షణంలోనైనా తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ శాఖ డైరక్టర్‌ జనరల్‌ ప్రకటించినట్లు పీటీఐ వెల్లడించింది. ఆంఫన్‌ తుపాను కారణంగా తీవ్రవేగంతో గాలులు వీస్తుండటంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది రంగంలోకి దిగారు.

చెట్లు విరిగిపడి కరెంటు తీగలు తెగిన ప్రాంతాలలో వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఒడిశా సరిహద్దు, తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని దిఘా పట్టణానికి వెళ్లే రహదారిపై భారీ ఎత్తున చెట్టు విరిగిపడటంతో వాటిని తొలగించే పనిలో ఎన్డీఆర్‌ఎఫ్‌ నిమగ్నమైనట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ ట్విటర్‌లో వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో సుమారు ఐదు లక్షల మందిని, ఒడిశాలో 1,58,560 మందికి పైగా ప్రజలను తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయించామని ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ఎస్‌.ఎన్‌. ప్రధాన్‌ వెల్లడించారు. ఒడిశాలో 20 టీమ్‌లు, పశ్చిమబెంగాల్‌లో 19 టీమ్‌లతోపాటు మరో రెండు అదనపు బృందాలను కూడా రంగంలోకి దించినట్లు ప్రధాన్‌ చెప్పారు.

గతంలో తుపాను ఫాని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి కూలిన చెట్లను నరకడానికి, పడిపోయిన స్థంభాలను తొలగించడానికి సిబ్బందికి అవసరమైన సామాగ్రిని అందించామని, తుపాను ప్రభావం తర్వాత వేగంగా పునర్నిర్మాణ పనులు కొనసాగుతాయని ప్రకటించారు.

మరోవైపు తుపాను ఆంఫన్‌ కారణంగా ఒడిశా తీరంలో భారీగాలులు వీస్తున్నాయి. బాలాసోర్‌ జిల్లాలోని చాందీపూర్‌లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By Julie