జులై 19, సోమవారం, నుంచి మొదలుకాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు డజనుకుపైగా కొత్త బిల్లులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిద్ధంచేసింది. అయితే, కరోనావైరస్ సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వం చేసిన తప్పిదాలు, రైతుల నిరసనలు, సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టేందుకు విపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
వర్షాకాల సమావేశాల సమయంలో పార్లమెంటు వెలుపల తమ రైతులు నిరసనలు చేపడతారని భారతీయ కిసాన్ యూనియన్ ఇప్పటికే స్పష్టంచేసింది. దీని వల్ల పార్లమెంటులో గందరగోళం మరింత పెరిగే అవకాశముంది.
ముఖ్యంగా కోవిడ్-19 వ్యాప్తికి కళ్లెం వేయడంలో విఫలం కావడం, దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్ అందక మరణాలు సంభవించడం తదితర అంశాలపై ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని విపక్షాలు భావిస్తున్నాయి.
మరోవైపు రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని జూన్ 23న కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే ఆ తర్వాత నుంచి మళ్లీ వ్యాక్సీన్ కార్యక్రమాలు నత్తనడకన సాగటం మొదలుపెట్టాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది.