విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం పెద్ద చర్చకు దారితీస్తోంది. తాజాగా జగ్గయ్యపేట ఉదంతం తర్వాత పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు ఘటనలు జరిగినా పాఠాలు నేర్చుకోకుండా చికిత్స పొందుతున్న రోగిని చనిపోయినట్లు నిర్ధారించి, బంధువులకు మృతదేహం అప్పగించడం కలకలం రేపింది.

ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన బంధువులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 15 రోజులకు చనిపోయిందనుకున్న మహిళ ఆస్పత్రి నుంచి డిచ్ఛార్జయ్యి నేరుగా ఇంటికి చేరడంతో అందరూ అవాక్కయ్యారు. జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ ఉదంతం తర్వాత విజయవాడ ఆస్పత్రి సిబ్బంది తీరు మీద పలు విమర్శలు వస్తున్నాయి. విచారణ జరపాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతం అవుతున్న తీరుపై పరిశీలన చేస్తామని చెబుతున్నారు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కరోనా సోకడంతో వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మే రెండోవారంలో ఆమెకు కరోనా లక్షణాలు బయటపడగా తొలుత జగ్గయ్యపేటలో వైద్యులను సంప్రదించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆమెను బంధువులు మే 12వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు.

అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స కూడా చేశారు. మూడు రోజుల తర్వాత కరోనాతో పోరాడుతూ ఆమె చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఆమె భర్త గడ్డయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న వార్డ్ మార్చడంతో తన భార్య కనిపించకపోయేసరికి అక్కడున్న సిబ్బందిని అడిగినానని గడ్డయ్య చెబుతున్నారు. ఆ తర్వాత మార్చురీలో వారు చూపించిన మృతదేహాన్ని తీసుకొచ్చామని అంటున్నారు . తీవ్ర విషాదంతో ఆస్పత్రికి వెళ్ళిన తమకు అక్కడి డాక్టర్లు సిబ్బంది కోవిడ్ నిబంధనల ప్రకారం ప్యాక్ చేసిన మృతదేహాన్ని అప్పగించారని గిరిజమ్మ సమీప బంధువు పరమేష్ బీబీసీకి తెలిపారు.

By Julie