52 రోజుల పాటు సాగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీ, కోవిడ్ కారణంగా నెల రోజులు తిరగకుండానే నిరవధికంగా వాయిదా పడింది.

ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో నిన్నటి కోల్‌కతా నైట్‌ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగలేదు. వృద్ధిమాన్ సాహా(సన్‌ రైజర్స్ హైదరాబాద్) కు కరోనా సోకిందని జట్టు యాజమాన్యం ప్రకటించడంతో మంగళవారం జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆగింది. చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మిపతి బాలాజీకి కరోనా సోకడంతో బుధవారం జరగాల్సిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను ఇప్పటికే వాయిదా వేశారు. ఇలా ఒక్కొక్కళ్లుగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో మొత్తం టోర్నీనే వాయిదా వేసింది బీసీసీఐ.

అత్యవసర సమావేశం తర్వాత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ”ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు, సిబ్బంది, ఈ టోర్నీ నిర్వహణలో పాల్గొంటున్న వారి ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడాలని బీసీసీఐ భావించడం లేదు. అందరి సంక్షేమాన్ని ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆ ప్రకటనలో పేర్కొంది. ”ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అయినా క్రికెట్ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో కొంత ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించాం. కానీ, ఈ క్లిష్ట పరిస్థితుల్లో టోర్నమెంటులో పాల్గొనే ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో గడపడం చాలా ముఖ్యం. అందుకే టోర్నమెంటును నిరవధికంగా వాయిదా వేస్తున్నాం.” అని తెలిపింది.

”ఐపీఎల్‌లో పాల్గొన్నవారందరూ క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేరే వరకు వారికి అన్ని విధాలా సహకరిస్తాం” అని కూడా బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆటగాళ్ల కోసం బయో బబుల్స్ ఏర్పాటు చేసి, వారికి కరోనా సోకకుండా జాగ్రత్త తీసుకుంది. అయితే, కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ టోర్నీ ఏంటని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఖర్చును దేశంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చని కొందరు సూచించారు.

By Julie