ఫాబియో చిగి విద్యావంతుడు, కళలు, నిర్మాణ సాంకేతికతపై ఆయనకు ఆసక్తి ఉండేది. తత్వ శాస్త్రం, వేదాంతం, న్యాయ శాస్త్రంలో ప్రవీణుడు.

కానీ, ‘పోప్ అలెగ్జాండర్ VII’ అవగానే ఆయన తనకు ఏమాత్రం అవగాహన లేని ఒక మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, అత్యంత కష్ట సమయంలో ఈ కాథలిక్ చర్చి అధిపతి, ఏ మాత్రం తొణక్కుండా రోమ్‌లో లాక్ డౌన్ విధించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన అప్పుడు చేపట్టిన ఆ చర్యలతో నగరంలో మిగతా ప్రాంతాల్లో కంటే చాలా తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయని, లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగారని పరిశోధకులు భావిస్తున్నారు. 1599లో జన్మించిన ఫాబియో చిగి 1667లో మరణించారు. అయితే, ఆ సమయంలో వ్యాపించిన ప్లేగ్ వ్యాధి గురించి ఎక్కడా పెద్దగా సమాచారం లేదు. 1894లో అలెగ్జాండరే ఎర్సిన్ ప్లేగ్‌కి కారణమైన వైరస్‌ను కనిపెట్టేవరకూ దాని గురించి ఎవరికీ తెలీదు.

ఈ ప్లేగ్ కేవలం ఆధునిక ఇటలీని మాత్రమే కాకుండా యూరోప్‌లో సుమారు సగం జనాభాను పొట్టన పెట్టుకున్నట్లు అంచనా వేస్తారు. “1656 – 1657 మధ్య కాలంలో వచ్చిన ఈ ప్లేగ్ సార్దీనియాలో 55 శాతం జనాభాను, నేపుల్స్‌లో సగం జనాభాను, జెనోవాలో 60 శాతం మంది ప్రాణాలు తీసిందని ఇటలీ చరిత్రకారుడు సాపిఎంజా చెప్పారని” యూనివర్సిటీ ఆఫ్ రోమ్ ప్రొఫెసర్ లూకా టోపీ అధ్యయనంలో తేలింది. కానీ, అప్పుడు రోమ్ నగరంలో ప్లేగ్ వల్ల 8 శాతం కంటే తక్కువ మరణాలు నమోదయ్యాయి. నగరంలోని లక్షా 20 వేల జనాభాలో, 9,500 మంది చనిపోయారని 2017లో ఇటాలియన్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైన సమాచారం చెబుతోంది. నేపుల్స్‌లో ప్లేగ్ వ్యాపించిన సమయానికి, అలెగ్జాండర్ VII చర్చికి అధికారి అయ్యి ఒక సంవత్సరం కావస్తోంది.

1656 మే – 1657 ఆగష్టు మధ్య కాలంలో ఈ మహమ్మారి వచ్చినపుడు, ప్రస్తుతం కరోనావైరస్ సమయంలో ఎలాంటి నిబంధనలు విధించారో అలాటివే అమలు చేసారు. ఈ పోప్ కాథలిక్ క్రైస్తవులకు మాత్రమే నాయకుడు కాదు. వాటికన్‌తోపాటూ రోమ్ చుట్టు పక్కల, అనేక చిన్న చిన్న రాష్ట్రాలను కూడా ఆయన పాలించారు. దానినే ఇప్పుడు సెంట్రల్ ఇటలీగా చెబుతున్నారు. రోమ్‌లో ఒక్కొక్క నిబంధననూ అమలు చేస్తూ వచ్చిన పోప్ అలెగ్జాండర్ VII నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితి దిగజారుతుండటంతో మెల్లగా సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. మే 20 నాటికి నేపుల్స్ రాజ్యంతో ఉన్న వాణిజ్య సంబంధాలను నిలిపివేశారు. వారం రోజుల తర్వాత నేపుల్స్ నుంచి రోమ్ వచ్చే ప్రయాణీకులను ఆపేసారు.

By Julie