ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందిన పొలంలో 13, 16 సంవత్సరాల దళిత అమ్మాయిల మృత దేహాలు లభించాయి.
అదే ప్రదేశంలో కనిపించిన మరో 17 ఏళ్ల అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిల మృత దేహాలు బుధవారం లభించినట్లు వారి కుటుంబాలు చెబుతున్నాయి. పెద్ద అమ్మాయిలు ఇద్దరూ అక్కా చెల్లెల్లు కాగా, 13 సంవత్సరాల బాలిక వారి బంధువు. వారి కాళ్లు, చేతులు వాళ్ల దుస్తులతోనే కట్టేసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం పశువులకు దాణా తీసుకొచ్చేందుకు ముగ్గురు బాలికలు పొలానికి వెళ్లారు. వారు చాలా సేపటి వరకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కోసం వెతకడం మొదలు పెట్టినట్లు వారి కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, ఆ అమ్మాయిలు విష ప్రయోగం వలన మరణించి ఉంటారని ఒక సీనియర్ పోలీసు అధికారి అన్నారు.
వారి నోటి నుంచి ఏదో తెల్లని ద్రవం వచ్చిందని, అది విషం బారిన పడిన లక్షణమని డాక్టర్లు చెబుతున్నారు. “ఈ సంఘటనలో అందరి సాక్ష్యాలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తాం. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం” అని పోలీస్ సూపరింటెండెంట్ సురేష్ రావు చెప్పారు. ఈ అమ్మాయిలు దళిత కుటుంబాలకు చెందినవారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసులతో ఉన్నావ్ జిల్లా వార్తల్లో ఉంది. సామూహిక అత్యాచారం జరిగిందనే కేసు విచారణ నిమిత్తం 2019లో కోర్టుకు వెళ్తున్న 23 ఏళ్ల ఉన్నావ్ మహిళపై దుండగులు దాడికి పాల్పడి, ఆమెకు నిప్పు అంటించారు. ఆ తరువాత ఆమె తీవ్ర గాయాలతో మరణించారు. 2019లో నమోదైన అత్యాచార కేసులో ఉన్నావ్‌కు చెందిన బీజేపీ నాయకుడు జైలుకెళ్లారు.
న్యూజీలాండ్ స్కూల్స్‌లో అమ్మాయిలకు ఉచితంగా పీరియడ్ ఉత్పత్తులు
న్యూజీలాండ్‌లోని అన్ని స్కూళ్లలో అమ్మాయిలకు నెలసరి సమయంలో పేదరికం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు జూన్ నుంచి ఉచితంగా పీరియడ్ ఉత్పత్తులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెలసరి సమయంలో టాంపన్లు, శానిటరీ ప్యాడ్లు వాడే ఖర్చు భరించలేక కొంత మంది అమ్మాయిలు తరగతులకు హాజరు కాలేకపోతున్నట్లు అధికారులు గుర్తించారు. గత సంవత్సరం దేశంలోని 15 పాఠశాలల్లో ఈ ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేసే పైలట్ కార్యక్రమం నిర్వహించారు.
“జనాభాలో సగం మంది జీవితాలలో అతి సాధారణమైన విషయం కారణంగా యువత చదువును కోల్పోకూడదు” అని న్యూ జీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ అన్నారు. నెలసరి సమయంలో వాడాల్సిన ఉత్పత్తులకు అయ్యే ఖర్చు భరించలేక న్యూజీలాండ్ లో ప్రతీ 12 మందిలో ఒకరు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని ఆర్డర్న్ చెప్పారు. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారిలో జరుగుతోంది. నెలసరి ఉత్పత్తులను ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పేదరికం సమస్యపై దృష్టి సారించి, స్కూలుకు హాజరయ్యే వారి సంఖ్యను పెంచాలని చూస్తున్నట్లు ఆమె చెప్పారు. దీని ద్వారా పిల్లల పై సానుకూల ప్రభావాన్ని కలుగచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ పథకం కోసం న్యూజీలాండ్ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి 2024 సంవత్సరం వరకు 130 కోట్ల 94 లక్షల 55 వేల రూపాయిల ఖర్చు అవుతుంది. గత సంవత్సరం శానిటరీ ఉత్పత్తులు కావల్సిన వారందరికీ ఉచితంగా పంపిణీ చేసి ప్రపంచంలోనే తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. ఇంగ్లాండ్‌లో కూడా గత సంవత్సరం నుంచి అన్ని ప్రాధమిక, సెకండరీ స్కూళ్లలో పీరియడ్ ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో కూడా స్కూళ్లలో ఉచితంగా పీరియడ్ ఉత్పత్తులను ఇవ్వాలని చట్టాలను జారీ చేశారు.