ప్రపంచంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో చైనా రాజధాని బీజింగ్ కూడా ఒకటి.

కానీ, ఏదైనా ఒకరోజు వాతావరణం తేట పడి, సూర్యకిరణాలు స్వచ్ఛంగా భూమి మీదకు వాలుతున్నాయంటే ఆరోజు బీజింగ్ నగరంలో ఏదో ఒక ముఖ్యమైన రాజకీయ సమావేశమో లేదా అంతర్జాతీయ స్థాయి కార్యక్రమమో జరుగుతున్నట్టు లెక్క. అయితే, ఇదేమీ యాదృచ్చికం కాదు.

ఎన్నో ఏళ్లుగా చైనా ప్రభుత్వ యంత్రాంగం వాతావరణంలో కృత్రిమ మార్పులు తెచ్చే కార్యక్రమాలు చేపడుతోంది. ఈ దిశగా మరో అడుగు ముందుకేస్తూ గత డిసెంబర్‌లో చైనా తన కార్యాచరణను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. 2025 కల్లా 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ వర్షం లేదా మంచు కురిపించే ప్రోజెక్ట్ చేపట్టాలనే ఆలోచనలో ఉంది. అంటే చైనా భూభాగంలో దాదాపు 60 శాతానికి ఈ ప్రణాళికను విస్తరిస్తున్నట్టు లెక్క. కాగా, భారత్ లాంటి పొరుగు దేశాలు ఈ సాంకేతిక విధానం కలిగించే ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, కొత్తగా వాతవరణంలో కృత్రిమ మార్పులు సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చైనా వాతావరణంలో కృత్రిమ మార్పులను ఎలా తీసుకొస్తుంది?
ఈ పద్ధతిని “క్లౌడ్ సీడింగ్” అంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికత ప్రసిద్ధి చెందింది. సిల్వర్ అయోడైడ్‌లాంటి పదార్థాలను మేఘాల్లోకి విస్తరింపజేయడం ద్వారా కృత్రిమ వర్షపాతాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తారు. “అనేక దేశాలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. చాలాకాలంగా చైనా దీన్ని ఉపయోగిస్తోంది. భారత్ కూడా గతంలో ఈ పద్ధతిని ఉపయోగించింది” అని వాతావరణ నిపుణులు ధనశ్రీ జయరాం తెలిపారు. ఈమె కర్ణాటకలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్‌లో పని చేస్తున్నారు.

“ఈ పద్ధతిని సబ్-సహారన్ ఆఫ్రికాలోనూ, ఆఫ్రికా ఖండం ఈశాన్య భూభాగంలో కూడా ఉపయోగించారు. ఆ ప్రాంతాల్లో కరవు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో కూడా ఈ పద్ధతిని ఉపయోగించి కృత్రిమ వాతావరణ మార్పులను కలుగజేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, అవన్నీ కూడా ప్రస్తుతం చైనా రచిస్తున్న ప్రణాళిక కన్నా చాలా చిన్న స్థాయిలో జరిగినవి” అని జయరాం తెలిపారు. క్లౌడ్ సీడింగ్ పద్ధతి ఇప్పటిది కాదు. దీని వెనుక చాలా చరిత్రే ఉంది. ఈ సాంకేతికతను 1940లలో కనుగొన్నారు. అయితే, దీని ఫలితాలపై ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి.

“దీని ప్రభావాలపై చాలా తక్కువ సైన్స్ వ్యాసాలు వెలువడ్డాయి” అని బీజింగ్ నార్మల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ జాన్ సీ మూర్ తెలిపారు.

“ఏ రకమైన శాస్త్రీయ నిర్థరణ జరగకుండానే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని అభివృద్ధి పరిచారు. చైనాలో క్లౌడ్ సీడింగ్ ఉపయోగించి వాతావరణ మార్పులను తీసుకురావడం కార్యాచరణకు సంబంధించిన అంశమే తప్ప శాస్త్రీయ అధ్యయనం కాదు. ఇందులో శాస్త్రీయత ఏమీ లేదు. దీన్ని ప్రాథమిక స్థాయిలో పరిమిత ప్రదేశాల్లో ఉపయోగిస్తారు” అని ఆయన చెప్పారు. బీజింగ్‌లో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించి వాతవరణం తేట పడేటట్లు చేస్తారు. అప్పుడప్పుడూ కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలకు అంటే వార్షిక పార్లమెంటరీ సెషన్లు లేదా ఏదైనా ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేస్తున్నప్పుడు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

చైనాలో 50,000 నగరాలు, పట్టణాలలో వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లకుండా ఉండేదుకు క్రమం తప్పకుండా క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగుస్తున్నారని మూర్ తెలిపారు.

“వడగళ్ల వాన పడి పంటలు నాశనం కాకుండా ఉండేందుకు క్లౌడ్ సీడింగ్ పద్ధతి వాడతారు. ప్రమాదకరంగా మారడానికి ముందే మేఘాల్లోంచి వర్షాన్ని తొలగిస్తారు” అని ఆయన చెప్పారు. అయితే, చైనాలో ఏడాదికి ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే క్లౌడ్ సీడింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ది న్యూ సైంటిస్ట్ మ్యాగజీన్‌లో 2020 ఫిబ్రవరిలో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం.. క్లౌడ్ సీడింగ్ వలన 10% కంటే తక్కువగానే వర్షపాతం నమోదవుతుంది.

By Julie