జర్మనీలో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలతో 16 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఏంగెలా మెర్కెల్ పాలనాకాలం ముగియనుంది.

ఒపీనియన్ పోల్స్‌లో మెర్కెల్‌కు చెందిన కన్జర్వేటివ్స్ కంటే సెంటర్-లెఫ్ట్‌కు కొద్దిగా ఆధిక్యం కనిపించింది. కానీ ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈసారి పార్లమెంట్‌లో మంచి సీట్లు సాధిస్తామని, చాన్స్‌లర్‌ను ఎన్నుకుంటామని మూడు పార్టీలు ధీమాగా ఉన్నాయి.

ఇవాళ (సెప్టెంబర్ 26న) జరుగుతున్న ఎన్నికల్లో జర్మనీ ఓటర్లు పార్లమెంట్ దిగువ సభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ దిగువ సభను బుండెస్టాగ్‌ అని పిలుస్తారు. దాదాపు 6 కోట్ల మంది జర్మన్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బుండెస్టాగ్‌లో కనీసం 598 సీట్లు ఉంటాయి. సాధారణంగా ఇంకా ఎక్కువే ఉంటాయి. ఏ పార్టీ గెలిచిందన్న విషయం ఇవాళ రాత్రికి తేలిపోతుంది. కానీ గెలిచిన పార్టీ మరో రెండు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి, పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వస్తుంది. అంటే మెర్కెల్ తర్వాత జర్మనీ చాన్స్‌లర్ ఎవరన్నది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు.

సంకీర్ణ కూటమిలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ చాన్స్‌లర్‌ను ఎంపిక చేస్తుంది. కానీ సంకీర్ణ కూటమి ఏర్పాటుకు సమయం పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలు, మంత్రి పదవులపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుంది. సంకీర్ణ కూటమిలోని పార్టీలు ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యులు ఓటింగ్‌ నిర్వహించి, చాన్స్‌లర్‌ను ఆమోదిస్తారు.

By Julie