2020 జులైలో ఆయిల్ ట్యాంకర్ ‘గల్ఫ్ స్కై’, దానిలోని సిబ్బందితో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర జలాల్లో కనిపించకుండా పోయింది.
కొన్ని రోజుల తర్వాత అదే నౌక ఇరాన్లో ప్రత్యక్షమైంది. ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ ఈ నౌకలో చమురు తరలిస్తోందనే అనుమానం వ్యక్తమవుతోంది. నౌక ఆచూకీపై అందులో పని చేసిన ఎనిమిది మంది మాజీ సిబ్బంది బీబీసీ దగ్గర తొలిసారి పెదవి విప్పారు. ఓడ కెప్టెన్ మినహా, మిగతా వారెవరూ ప్రాణ భయంతో తమ పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. యూఏఈ తీరంలో సూర్యాస్తమయం అవుతోంది.
తీరంలో ది గల్ఫ్ స్కై నౌక లంగరు వేసుంది. దానికి కెప్టెన్ జోగీందర్ సింగ్. దాని పాత, కొత్త యజమానుల మధ్య తలెత్తిన న్యాయపరమైన వివాదం ఆ ఓడను తీరానికి పరిమితం చేసింది. నౌకకు కెప్టెన్‌గా ఉండాలని తనకు పిలుపు వచ్చినప్పుడు, గల్ఫ్ స్కై త్వరలోనే సముద్రయానం చేస్తుందని హామీ ఇచ్చినట్లు కెప్టెన్ జోగీందర్ సింగ్ వెల్లడించారు. కానీ ఆ ఎదురుచూపులు వారాల నుంచి నెలలకు మారాయి. అదే సమయంలో కరోనా మహమ్మారి విజృంభించింది. ఫలితంగా ఓడలో ఉన్న నావికులు (అందరూ భారతీయులే) నేలకు దూరంగా, నౌకలోనే ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో తగినంత ఆహారం, నీళ్లు లేక ఇబ్బందులు పడ్డామని, ఇంటర్నెట్ కూడా సరిగ్గా అందుబాటులో ఉండేది కాదని వారు చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి జీతాలు ఇవ్వడం కూడా ఆపేశారని వాపోయారు. జులై 5న సాయంత్రం అంతా కొత్తగా మొదలవుతుందని కెప్టెన్ భావించారు. నౌక యజమానులు కొత్త పని కోసం ట్యాంకర్ పరిస్థితిని అంచనా వేయడానికి సర్వేయర్ల బృందాన్ని నియమించినట్లు వారికి తెలిసింది. ఓ చిన్న పడవ చీకటిని చీల్చుకుంటూ ఓడ వైపుగా వచ్చింది. అప్పటికే అలసిపోయిన అధికారి, గ్యాంగ్వేను దించమని ఆదేశించి, ఆ ఓడలోని వారిని కలవడానికి వెళ్లారు.
మొదట్లో అంతా మామూలుగానే అనిపించిందని కెప్టెన్ చెప్పారు. పూర్తిగా నీలి రంగు దుస్తులు ధరించి, చేతిలో క్లిప్ బోర్డులతో ఉన్న ఏడుగురు ఓడను తనిఖీ చేయడానికి నావికులతో కలిసి వెళ్లారు. ఓ గంట తర్వాత వారి సర్వే పూర్తయింది. ఆ గ్రూప్‌కు నాయకుడుగా వచ్చిన 60 ఏళ్ల వ్యక్తి చాలా కలుపుగోలుగా ఉన్నారు. ఆయన ఓడలోని 28 మంది నావికులను భోజనశాలలో సమావేశం కావాలని కోరినట్లు తెలిపారు. ఓడను ఆయిల్ స్టోరేజ్ కంటైనర్‌గా మార్చబోతున్నట్లు చీఫ్ సర్వేయర్ వెల్లడించారు. కెప్టెన్, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మరికొన్ని నెలల పాటు ఓడలోనే ఉండాలని వారు కోరారు. అందుకు అదనపు జీతం చెల్లిస్తామన్నారు. దీనికి కేవలం ఇద్దరు నావికులు మాత్రమే సుముఖత వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి కావొస్తుండటంతో కెప్టెన్ అందరినీ పడుకోమని చెప్పారు. ఆయన తన గది తలుపు తీస్తుండగానే నల్ల దుస్తులు వేసుకున్న ముగ్గురు తుపాకులతో లోపలికి దూసుకొచ్చారు. అందరూ నేలపై పడుకోవాలని వాళ్లు గట్టిగా అరిచారని కెప్టెన్ చెప్పారు. “మేం మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోవడం లేదు. కానీ అలా చేయాల్సివస్తే మేం ఆలోచించం. అమెరికా ఈ నౌకను దొంగిలించింది. మేం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం” అని చీఫ్ సర్వేయర్ గట్టిగా చెప్పాడని కెప్టెన్, మిగతా నావికులు తెలిపారు.