ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ధనవంతులు, ప్రభుత్వ అధికారుల రహస్య సంపద, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గుట్టు రట్టు చేశాయి పాండోరా పేపర్స్.
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ సహా 300 మందికి పైగా భారతీయుల పేర్లు ఈ పాండోరా పేపర్స్‌లో బయటపడ్డాయి. ఈ లీకులపై దర్యాప్తు జరపాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్రా ఈ దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తారు. సీబీడీటీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) కూడా ఈ దర్యాప్తులో భాగస్వాములవుతాయి.
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ దగ్గర, ఆయన ప్రతినిధుల దగ్గర కలిపి కనీసం 18 ఆఫ్‌షోర్ కంపెనీలు ఉన్నట్లు లీకైన రికార్డులు చెబుతున్నాయి. 2007, 2010 మధ్య స్థాపించిన ఈ కంపెనీల్లో ఏడు కంపెనీలు కనీసం 130 కోట్ల డాలర్లు (రూ. 9,754 కోట్లు) అప్పులు చేసి పెట్టుబడి పెట్టాయి. ఈ లీకులపై అనిల్ అంబానీ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు. కానీ, ఆయన తరపున పేరు వెల్లడించడానికి ఇష్టపడని న్యాయవాది ఒకరు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికతో మాట్లాడారు.
“మా క్లయింట్లు భారతదేశంలో పన్నులు సక్రమంగా చెల్లించే పౌరులు. చట్టానికి అనుగుణంగా భారతీయ అధికారులకు చెప్పవలసినవన్నీ చెప్పారు. లండన్ కోర్టులో విషయాలను వెల్లడించడానికి అవసరమైన అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తోంది. చట్టబద్ధమైన వ్యాపారం, నియంత్రణ కోసం కంపెనీలను వివిధ అధికార పరిధుల్లో చేర్చారు” అని చెప్పారా న్యాయవాది.