భూతాపం 1.5C దాటకుండా కట్టడి చేసేందుకు ఇదే చివరి అవకాశమని కాప్ 26 సదస్సు పిలుపునిచ్చింది. దీనిపై సదస్సులు, ఒప్పందాలకు మించి దేశాలు చేపట్టవలసిన ముఖ్యమైన చర్యలేంటి?

1. శిలాజ ఇంధనాల తగ్గింపు

చమురు, గ్యాస్, ముఖ్యంగా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వలన గాల్లోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. దాంతో వేడి పెరిగి, ప్రపంచ ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. భూతాపం 1.5C దాటితే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టాలి. అయితే, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, భారత్ వంటి బొగ్గు ఆధారిత దేశాలు దశలవారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించే ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాయి.

2. మీథేన్ ఉద్గారాలకు కళ్లెం వేయడం

మీథేన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా అత్యవసర పరిస్థితులను నివారించవచ్చని, వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్యసమితి ఇటీవల నివేదిక సూచించింది. చమురును వెలికితీసే ప్రక్రియలో మండుతున్న సహజ వాయువుల నుంచి అధిక స్థాయిలో మీథేన్ విడుదల అవుతుంది. అధునాతమైన సాంకేతిక ప్రక్రియల ద్వారా దీన్ని నివారించవచ్చు. అలాగే, చెత్తను పారవేసేందుకు మెరుగైన మార్గాలను అన్వేషించాలి. కొండల్లా పేరుకుపోయే చెత్తకుప్పలు మీథేన్ ఉద్గారాలకు మూలాలు. కాప్ 26 సదస్సులో సుమారు 100 దేశాలు మీథేన్ ఉద్గారాలను కట్టడి చేసే ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు సారథ్యం వహించాయి. 2020 స్థాయిల కన్నా 30 శాతం మీథేన్ ఉద్గారాలను తగ్గించడమే ఈ అంతర్జాతీయ మీథేన్ ప్రతిజ్ఞ లక్ష్యం.

3. పునరుత్పాదక శక్తిని వినియోగించడం

ప్రపంచ ఉద్గారాలు పెరగడంలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. శిలాజ ఇంధన వనరులను తగ్గించి, పునరుత్పాదక వనరుల వినియోగాన్ని పెంచడం ఈ సమస్యకు ఒక ముఖ్య పరిష్కారం. ప్రస్తుత వాతావరణ లక్ష్యాలను చేరుకోవాలంటే డీకార్బనైజేషన్‌కు తోడ్పడే క్లీన్ టెక్నాలజీని ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. దేశాలు నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2050 కల్లా ఇంధన వనరుల్లో పవన విద్యుత్, సౌర శక్తి వాటాలు గణనీయంగా పెరగాలి. అయితే, సవాళ్లు ఉన్నాయి. గాలి తక్కువైతే విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. కానీ, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ సహాయంతో అదనపు శక్తిని నిల్వ చేసుకుంటూ, అవసరమైనప్పుడు విడుదల చేసుకోవచ్చు.

By Julie