ఎవరికీ ఏమీ తెలియదు. రాజే నేరస్తుడని మాత్రం చాలా గట్టిగా అనుమానం ఉంది. ఎంత గట్టి అనుమానమైనా నిజానికి ప్రత్యామ్నాయం కాబోదనేది ప్రాథమిక న్యాయసూత్రం.

మిగతా అనుమానాల మాట ఎట్లా ఉన్నా, క్రిమినల్ కేసుల్లో నేరారోపణలకు రుజువులు వెతికే సమయంలో అనుమానాలు నమ్మకాలకన్నా సాక్ష్యాలు అవసరమవుతాయి. ఆరేళ్ల చిన్నారిని ఇంత దారుణంగా లైంగిక దాడికి గురిచేసి చంపేయడం అనేది మరణ శిక్ష ఇవ్వదగిన నేరం అని భారతీయ శిక్షాస్మృతిలో ఉంది. అయితే మరణ శిక్షే ఇచ్చి తీరాలని లేదు. న్యాయాధికారి సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువు స్థాయిని బట్టి, అతని నేరపూరిత ఆలోచన గాఢతను బట్టి శిక్ష తీవ్రత ఆధారపడి ఉంటుంది. మరణ శిక్షను అరుదైన నేరాలలోకెల్లా అరుదైన నేరమని రుజువైన సందర్బాలలో మాత్రమే విధించాలని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాలలో నిర్దేశించింది. అది శాసనం.

ఐపిసిలో యావజ్జీవ కారాగార శిక్షనుంచి మరణ శిక్షదాకా అనే వాక్యం ఉండడం వల్ల జడ్జిగారి విచక్షణతో సహా అనేకానేక అంశాల మీద ఆధారపడి యావజ్జీవ శిక్షగానీ మరణ శిక్ష గానీ విధిస్తారు. సందేహానికి అతీతంగా ఒకరి నేరం రుజువై అతని దురుద్దేశం తేటతెల్లమయితే, ఆ నేరం కూడా అరుదైనవాటిల్లోకెల్లా అరుదైనదైతే ఉరిశిక్ష ప్రకటించడం, దానిపైన నిందితుడు అప్పీలుకు వెళ్లకపోయినా, ప్రభుత్వమే అపీలుకు తీసుకువెళ్లి హైకోర్టుచేత ధృవీకరింపజేయాలని, అందాకా ఉరి శిక్ష అమలు చేయరాదని ముందు జాగ్రత్త చర్యలు అనేకం ఉన్నాయి.

ఆ తరువాత నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అక్కడ కూడా ఉరి ఖరారు అయితే, సమీక్ష కోరవచ్చు, ఆ తరువాత రాష్ట్రపతి క్షమాభిక్ష కోరవచ్చు. తిరస్కారాన్ని సవాలు చేయవచ్చు. అన్నీ ముగిసిన తరువాతనే మరణ శిక్ష అమలు చేయాలి. ఇంత తతంగం ఎందుకంటే పొరపాటున కూడా నిర్దోషికి, తక్కువ దోషికి లేదా సాక్ష్యాలు సరిపోయేంతగా లేనిదశలో నిందితుడికి అన్యాయంగా మరణశిక్ష ఇవ్వకుండా న్యాయాన్ని కాపాడడానికి మాత్రమే. వ్యక్తి స్వేచ్ఛ ప్రాణాన్ని న్యాయమైన మార్గాల ద్వారా మాత్రమే హరించే అధికారం కోర్టులకు ఇచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వివరించేది అదే.

మన న్యాయశాసనాలు పోలీసులకు మరణ శిక్ష విధించే అధికారం ఇవ్వలేదు. మరొకరిని కొట్టే అధికారం కూడా ఎక్కడా ఇవ్వలేదు. కొడితే పోలీసు అధికారిపైన కూడా క్రిమినల్ కేసుపెట్టాలని 1860 నుంచి మన ఐపిసిలో ఉంది. ఈ సెక్షన్ కొట్టేయాలని పోలీసులెవరూ అడగలేదు. కోర్టుకూడా చెప్పలేదు.

By Julie