కాబుల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు సంభవించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోల్లో భవనాల మధ్య నుంచి నల్లని పొగలు పైకి లేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఈ ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదికారి ఒకరు ధ్రువీకరించారు. ఐఎస్-కే గ్రూప్ సూసైడ్ బాంబర్ లక్ష్యంగా అమెరికా క్షిపణి దాడి చేసినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. కాబుల్ విమానాశ్రయంపై దాడికి మాటు వేసిన ఆ సూసైడ్ బాంబర్ ఉన్న వాహనంపై డ్రోన్ సహాయంతో క్షిపణి ప్రయోగించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

”కచ్చితంగా మేం ఎంచుకున్న లక్ష్యంపై దాడి చేశాం” అని యూఎస్ మిలటరీకి చెందిన ఓ అధికారి బీబీసీ యూఎస్ పార్టనర్ నెట్‌వర్క్ సీబీఎస్‌కు చెప్పారు. ”సాధారణ పౌరులెవరూ ఈ దాడిలో మరణించినట్లు ఇంతవరకు సమాచారం లేదు” అని ఆ అధికారి చెప్పారు. క్షిపణి దాడి తరువాత ఆ వాహనం నుంచి మరిన్ని పేలుళ్లు జరిగాయని, దాన్ని బట్టి ఆ వాహనంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అర్థమవుతుందన్నారు. సూసైడ్ బాంబర్‌గా అనుమానిస్తున్న వ్యక్తి ప్రయాణిస్తున్న కారుపై అమెరికా దాడి చేసిందని తాలిబాన్ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ అసోసియేట్ ప్రెస్ వెల్లడించింది.

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షఫీ కరీమి పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌లోని దృశ్యాలు కాబుల్ సమీపంలో పేలుడు జరిగిన తరువాత తీసినవిగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నగరంలోని ఓ నివాసం మీద ఈ రాకెట్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

కాబుల్ విమానాశ్రయం దగ్గర మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఈ దాడులు ఆదివారం జరగవచ్చని తమ కమాండర్లు తనకు చెప్పారని ఆయన తెలిపారు. మళ్లీ పేలుళ్ల ముప్పు ఉందనే విశ్వసనీయ సమాచారంతో విమానాశ్రయం సమీప ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ తమ దేశ పౌరులను కోరింది. కాబుల్ విమానాశ్రయంలో అమెరికా దళాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి విడత అమెరికా దళాలు, దౌత్యవేత్తలు, అధికారులు అఫ్గానిస్తాన్ నుంచి బయల్దేరారు.

By Julie