2021 ఆగస్టు చివరలో, టాలియా ష్ముయెల్ తన ఐదేళ్ల కొడుకుకు కోవిడ్ టీకా వేయించేందుకు జెరూసలేంలోని స్థానిక ఆరోగ్య క్లినిక్‌కు తీసుకువెళ్లారు. బాబుకు పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బుతోపాటు శ్వాసనాళాలు కూడా కుంచించుకుపోయాయి. దాంతో, ఆ బాలునికి కరోనావైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

“అతను ఎప్పుడైనా జబ్బుపడినప్పుడు, అది సాధారణంగా న్యుమోనియాగా మారుతుంది. అతను తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు” అని ష్ముయెల్ చెప్పారు. ష్ముయెల్‌కు ముగ్గురు పిల్లలు. చిన్న వయసు కలిగిన తన కొడుకుకు వ్యాక్సిన్ వేయించడానికి, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.వ్యాక్సీన్ వేయించాలనే నిర్ణయం సరైందనే నమ్మకంతో ఆమె ఉన్నారు.

“నా భర్త, నేను పరిశోధనా విశ్లేషకులుగా పని చేస్తున్నాం. మేం ప్రతీ విషయాన్ని విశ్లేషించాం. మేము అనేక విభిన్న అంశాలను తనిఖీ చేశాం. టీకాతో దుష్ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉందని నిర్ధరించుకున్నాం. అయితే, అవి కోవిడ్19 వల్ల కలిగే దుష్ప్రభావాల తీవ్రత కంటే తక్కువని తెలుసుకున్నాం” అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు 12 ఏళ్లు నిండిన పిల్లలకు కోవిడ్19 వ్యాక్సిన్లను ఇవ్వడం ప్రారంభిస్తున్న తరుణంలో, భవిష్యత్తు ఎలా ఉండబోతోందననే అంశం పట్ల ఇజ్రాయెల్ ఒక అవలోకనాన్ని కల్పిస్తోంది.

ఈ ఏడాది మొదట్లో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అత్యధిక మంది వయోజనులకు వేగంగా టీకాలను అందచేసింది. జూన్‌లో పాఠశాలల్లో కోవిడ్ వ్యాప్తి మొదలయిన తర్వాత, 12 ఏళ్లు నిండిన పిల్లలకు కూడా టీకాలు వేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం వీరికి మూడవ మోతాదుగా బూస్టర్ షాట్‌‌లను ఇస్తోంది. జులై నుంచి కొన్ని అసాధారణమైన పరిస్థితులలో ఉన్న 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు కూడా టీకాలు అందిస్తోంది.

ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ పిల్లలకు సురక్షితమని చెబుతున్నప్పటికీ కూడా పిల్లల విషయంలో దీనిపై నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కోవిడ్-19 కు లోనయ్యే ముప్పు పిల్లల్లో తక్కువగా ఉండటం వల్ల వారికిచ్చే టీకా చిన్నపాటి ప్రతికూల ప్రభావం చూపినా కూడా టీకాను సమర్ధించడం కష్టమవుతుంది.

By Julie