భారత్‌లోని అన్ని మతాల ప్రజలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ అధ్యయనం గుర్తించింది.

దీంతో 1951 నుంచి దేశంలో జనాభాపరంగా మత కూర్పులో పెద్దగా తేడాలు రాలేదు. 120 కోట్ల జనాభా గల భారతదేశంలో రెండు అతి పెద్ద మత సమూహాలైన హిందువులు, ముస్లింలు కలిపి 94 శాతం ఉన్నారు. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కలిపి 6 శాతం ఉన్నారు. పదేళ్లకోసారి చేసే జనగణన, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్‌హెచ్ఎస్) డాటాను పరిశీలించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ భారత్‌లో మత కూర్పులో చోటుచేసుకున్న మార్పులు, అందుకు దారి తీసిన కారణాలను విశ్లేషించింది.

1951లో 36.1 కోట్లుగా ఉన్న భారత్ జనాభా 2011 నాటికి 120 కోట్లకు పెరిగింది. స్వతంత్ర భారతదేశంలో తొలి జనగణన 1951లో నిర్వహించగా చివరి జనగణన 2011లో జరిగింది. 2011 తరువాత 2021లో జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ 60 ఏళ్ల వ్యవధిలో భారత్‌లోని అన్ని మతాల జనాభా పెరిగింది. హిందువుల జనాభా 30.4 కోట్ల నుంచి 96.6 కోట్లకు… ముస్లింల జనాభా 3.5 కోట్ల నుంచి 17.2 కోట్లకు పెరిగింది. క్రైస్తవుల జనాభా 80 లక్షల నుంచి 2.8 కోట్లకు పెరిగింది.

భారత్‌లో మతాల కూర్పు ఇలా (2011 జనాభా లెక్కల ప్రకారం)

* 120 కోట్ల భారత జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. ప్రపంచ హిందూ జనాభాలో 94 శాతం భారత్‌లోనే నివసిస్తున్నారు.
* భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల శాతం 14.2. ఇండోనేసియా తరువాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్.
* క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు భారత జనాభాలో 6 శాతం ఉన్నారు.
* 30 వేల మంది తమను తాము నాస్తికులుగా చెప్పుకొన్నారు.
* హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందనివారు 80 లక్షల మంది భారత్‌లో ఉన్నారు.
* ప్రధానమైన ఈ ఆరు మతాలు కాకుండా మరో 83 మతాలు భారత్‌లో ఉన్నాయి.
* భారత్‌లో నెలకు సగటున 10 లక్షల జననాలు నమోదవుతాయి. ఈ జననాల రేటు ప్రకారం చూస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల చైనాను 2030 నాటికి భారత్ అధిగమించే అవకాశముంది.

By Julie