అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో అనేక మంది ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోయేందుకు పరుగులు పెట్టారు.

అఫ్గానిస్తాన్‌కు చెందిన “డి” అనే మహిళ కూడా తన కొడుకుతో కలిసి సూట్ కేసులో నగలు, వాచీలు, కొంత డబ్బు, హార్డ్ డ్రైవ్స్, పనికి సంబంధించిన పత్రాలు, సరిపడినన్ని బట్టలు పట్టుకుని బయలుదేరారు. చలి ప్రాంతాల్లో చిక్కుకుంటే చలి నుంచి కాపాడుకునేందుకు కొన్ని ఊలు దుస్తులు కూడా పెట్టుకున్నారు.

ఆమె కాబుల్ నివాసి కాదు. ఇప్పటికే ఆమె ఒక వారం రోజులుగా పరుగు పెడుతూనే ఉన్నారు. తాలిబాన్లు ఆక్రమించిన సరిహద్దుల్లో ఉన్న నగరం నుంచి పారిపోయి ఆమె కాబుల్ వచ్చారు. ఆమె ఒక మహిళా హక్కుల ఉద్యమకారిణి. తాలిబాన్లు ఆమె నివాసం ఉండే పట్టణాన్ని ఆక్రమించిన తర్వాత ఆ ఊరిలో ఉండటం ఆమెకు సురక్షితంగా అనిపించలేదు.

తలకి స్కార్ఫ్ కప్పుకుని, ముఖానికి మాస్క్, చేతికి గ్లోవ్స్ వేసుకుని ఆమె కొడుకుతో పాటు ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు కాబుల్ లో ట్యాక్సీ కోసం వెతికారు. చివరకు ట్యాక్సీ దొరకక, మండే ఎండలో చేతిలో సూట్ కేసులు మోస్తూ ఒక గంట సేపు నడిచారు. ఎయిర్ పోర్ట్ దగ్గరకు వెళ్లేసరికి అదంతా గందరగోళంతో నిండిన సుడిగుండంలా కనిపించింది. పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఎయిర్ పోర్ట్ గోడలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ, రోడ్ల పై పరుగులు తీస్తూ, ట్యాక్సీవేస్ దగ్గర చతికిలపడుతూ, ఆగిన విమానాల పైకి ఎక్కి కూర్చుంటూ కనిపించారు.

ఎలా అయినా స్వేచ్ఛను పొందాలనే ఆశతో కొంత మంది యువకులు కదులుతున్న అమెరికా వైమానిక దళ విమానాలకు వేలబడుతూ కనిపించారు. సాయంత్రం అయ్యేవరకూ డి తన కొడుకుతో కలిసి విమానం దొరుకుతుందేమోనని ఎదురు చూశారు. ఎటువంటి లాభం లేకపోవడంతో, ఇద్దరూ వెనుతిరిగారు. అయితే, వారికి ఎదురుగా అదే సమయంలో కొన్ని వేల మంది ఎయిర్ పోర్టులోకి రావడం మొదలయింది.

By Julie