Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       

నిర్మ‌ల్ చ‌రిత్ర‌

రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో పేరు సంపాదించిన నిర్మల్ కు సుమారు 400 ఏళ్ల ఘన చ‌రిత్ర ఉంది. ఏడు చెరువులు, ఏడు ద‌ర్వాజాలు, ఎత్తైన బురుజులు. ఇవేకాకుండా కొయ్య‌బొమ్మ‌లు, చిత్ర‌లేఖ‌నం నిర్మ‌ల్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మ‌ల్ ముఖ్య ప‌ట్ట‌ణం. ఒక‌వైపు చ‌రిత్ర మ‌రోవైపు చిత్ర‌క‌ళ‌... చుట్టూ చెరువులు, ప‌చ్చ‌ని పొలాలు.. ఇది నిర్మ‌ల్‌కు షాట్ క‌ట్ హిస్ట‌రీ.

నాలుగు శతాబ్దాల నిర్మల్

నాలుగు వంద‌ల సంవ‌త్స‌రాల‌కు పూర్వం మ‌న నిర్మ‌ల్ లో కోట‌లు, బురుజులు, రాజ‌భ‌వ‌నాలు క‌ళ‌క‌ళ‌లాడుతుండేవి. కానీ ఇప్పుడు అవి శిథిల‌మైనపోయాయి. నాలుగు వంద‌ల సంవ‌త్స‌రాల‌కు క్రితం శ్రీరామ‌దాసుకు స‌న్నిహితుడైన వెల‌మ ద‌ళ‌వాయి నిమ్మ‌నాయుడు కుటుంబ స‌మేతుడై కొంత మంది సిబ్బందితో భ‌ద్రాచలం నుంచి తూర్పు గోదావ‌రి న‌దీ తీరం వెంబ‌డి చెన్నూరు, కోటిలింగాల నుంచి మ‌ట్టి కోట‌గా నెల‌కొని ఉన్న న‌ల్ల‌గుట్టకు చేరుకున్నాడు. అక్క‌డ ఔరంగ‌జేబు నియ‌మించిన అప్ప‌టి ఖిల్లాదారుపై విజ‌యం సాధించి అక్క‌డి నుంచి ఉత్త‌ర ప‌శ్చిమంగా ప్ర‌యాణం చేసి పులిమ‌డుగు (ఇప్ప‌టి బ‌త్తిస్ ఘ‌డ్) కు చేరుకున్నాడు. అక్క‌డి నుంచి ఇప్ప‌టి దేవ‌ర‌కోట శ్రీ ల‌క్ష్మీవేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌య ప్రాంతానికి వెళ్లి ఆ దేవాల‌య మ‌హ‌త్తును తెలుసుకున్నాడు. ఆ దేవాల‌య స‌మీపంలోనే కుటీరాలు ఏర్ప‌ర్చుకుని శ్రీ సీతారామంజనేయ విగ్ర‌హాల‌ను స్థాపించి పూజ‌లు ప్రారంభించాడు. అలా ఆ ప్రాంతం జ‌నావాసంగా మారింది.

నిమ్మ‌ల నుంచి నిర్మల్‌గా

నిర్మ‌ల్ లోని ప్ర‌స్తుత క‌స్బా గ‌ల్లీలో 12 ఇండ్ల‌తో రూపొందిన గ్రామానికి నిమ్మ‌ల అని నామ‌క‌ర‌ణం చేశారు. కొన్నేళ్ల పాటు నిమ్మ‌ల‌గా కొన‌సాగిన ఈ పేరు నిర్మ‌ల్ గా మారిపోయింది. ప‌న్ను క‌ట్టే విష‌యంలో నిమ్మ‌నాయుడు బ‌త్తిస్ ఘ‌డ్ ఖిల్లాను కుంటి వేంక‌ట్రాయుడికి తాక‌ట్టుపెట్టాడు. నాందేడ్ సుబేదారుకు చెల్లించాల్సిన ప‌న్నుకు స‌రిప‌డ‌ 30 వేల రూపాయ‌లు కుంటి వేంక‌ట్రాయుడి ద‌గ్గ‌ర అప్పుగా తీసుకున్నాడు. నిమ్మ‌నాయుడు ఆ అప్పు వ‌డ్డీతో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు కాగా అవి చెల్లించ‌క‌పోవ‌డంతో వేంక‌ట్రాయుడు త‌న బ‌ల‌గంతో వెళ్లి నిమ్మ‌ల ఖిల్లాను ఆక్ర‌మించుకున్నాడు. కొన్ని రోజుల త‌ర్వాత నిమ్మ‌నాయుడు మ‌ర‌ణించాడు.

వేంక‌ట్రాయుడి ఆలోచన భేష్!

నిమ్మ‌నాయుడి పాలన త‌ర్వాత కుంటివెంక‌ట్రాయుడు నిమ్మ‌ల‌ను పాలించాడు. వెల‌మ కుటుంబానికి చెందిన కుంటివెంక‌ట్రాయుడు 1650-1700 మ‌ధ్య కాలంలో మ‌హారాష్ట్ర‌లోని నాగ్ పూర్ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చాడు. అక్క‌డ జ‌రిగిన యుద్ధాల్లో వెంక‌ట్రాయుడి త‌న కాలును పోగొట్టుకున్నాడు. పూర్తి ప‌రివారంతో నాగ్ పూర్, హైద‌రాబాద్ బాట‌గా ఉన్న అర‌ణ్య ప్రాంతం నుంచి వ‌స్తూ వ‌స్తూ మ‌ధ్య‌లో వాంకిడికి చేరుకున్నాడు. వెంక‌ట్రాయుని వెంట అత‌ని అనునాయులైన వెల‌మ‌ల‌తో పాటు కొంద‌రు మేధావులు, విశ్వాస పాత్ర‌తో ఉన్న ముస్లిం స‌ర్ధారులు కూడా ఉన్నారు. వాంకిడిలో ఉన్న గిరిజ‌నులు వేంక‌ట్రాయునికి అత‌నితో పాటు వ‌చ్చిన అంద‌రికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించారు. అలా వేంక‌ట్రాయుడు వాంకిడి నుంచి నిమ్మ‌ల‌కు వ‌చ్చి త‌న పాల‌న‌ను కొన‌సాగించాడు. ఆ స‌మ‌యంలోనే వేంక‌ట్రాయుడు త‌న‌కు న‌చ్చిన‌రీతిలో కొండ‌ల మ‌ధ్య కోట‌ను, బురుజుల‌ను నిర్మించాడు. అంతేకాకుండా నిర్మ‌ల్ చుట్టూ కంద‌కాలు, కోనేరు బావులు, దేవాల‌యాలు నిర్మించాడు.

‘యువ’ పాల‌న‌లో నిమ్మ‌ల

వేంక‌ట్రాయుని పాల‌న త‌ర్వాత అత‌ని కొడుకు జ‌ల‌ప‌త్ రావు నిమ్మ‌ల‌కు ప్ర‌భువుగా నియ‌మితుడ‌య్యాడు. జ‌ల‌ప‌త్ రావు కూడా త‌న తండ్రి బాట‌లోనే న‌డిచాడు. యుద్ధాలలో త‌నకంటూ ఓ ప్ర‌త్యేకత ఏర్ప‌ర్చుకున్నాడు. నిజాం రాజు ప్ర‌తినిధి అమీర్ ఖాన్‌తో జ‌రిగిన యుద్ధంలో విజ‌యం సాధించి అత‌ని వ‌ద్ద ఉన్న డ‌బ్బును స్వాధీన ప‌ర్చుకున్నాడు. 22 సంవ‌త్సరాల‌ త‌న పాల‌న‌లో జ‌ల‌ప‌త్ రావు కొన్ని బురుజులు, చెరువులు నిర్మించాడు. జ‌ల‌ప‌త్ రావు మ‌ర‌ణించిన త‌ర్వాత వేంక‌ట్రాయుని మేన‌ల్లుడైన క‌ణింగ‌రాయుని కుమారుడు శ్రీనివాస‌రావు నిమ్మ‌ల‌కు ప్ర‌భువుగా నియమితుడ‌య్యాడు. యువ‌కుడైన శ్రీనివాస‌రావు చ‌క్క‌గా రాజ‌కీయ యుక్తులు తెలిసికొని త‌గు సైనిక బ‌ల‌మును, ధ‌న, ధాన్య‌ముల‌ను సేకరించుకుని త‌న రాజ్యాన్ని ప‌టిష్టం చేశాడు. అంతేకాకుండా నిమ్మ‌ల‌కు చుట్టు ప‌క్క‌ల ఉన్న భైంసా, చాంద‌, సిరిపూర్, చెన్నూరు, జ‌గిత్యాల ప్రాంతాల‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆయా ప్రాంతాల నుండి అన్ని వృత్తుల వారిని ర‌ప్పించి వేంక‌టాద్రిపేట ప‌డ‌మ‌ర‌, ద‌క్షిణ, ఉత్త‌ర భాగ‌ములందు కొండ‌ల ఒడిలో నివాస‌యోగ్యంగా ఉండుట‌కు వేరు వేరు వాడ‌లు ఏర్పాటు చేశాడు. ఇదే సమయంలో శ్రీనివాస‌రావు ఖిల్లా గుట్ట‌ను నిర్మించాడు. ఈ కోట‌లో అంతఃపుర‌సౌధం, పూజా మందిరం, గాలి మేడ‌, భండాగారం, మంచినీటి కోనేరు బావి, నాట్య‌శాల‌, స్ర్తీల‌కు ప్ర‌త్యేక గ‌దులు ఉండేలా నిర్మించాడు. అలాగే నిమ్మ‌ల చుట్టూ ఏడు సింహ‌ద్వారాలు ఏర్పాటు చేయించాడు. శ్రీనివాస‌రావు త‌న పాతికేళ్ల పాల‌న‌లో ప‌ట్ట‌ణం చుట్టూ ప్ర‌హారీ గోడ‌, 64 బురుజులు, ప్ర‌హారీ గోడ వెంబ‌డి లోతైన‌ కంద‌కాలు నిర్మించాడు.