Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
దుబాయ్‌లో చావుకు నెలరోజుల డెడ్‌లైన్‌

- 30 రోజుల్లో క్షమాభిక్ష తెచ్చుకోకపోతే మరణశిక్షే
- తెలంగాణ కార్మికుడు శంకర్‌కు దుబాయ్‌ కోర్టు వార్నింగ్‌
- హత్యానేరంపై 9 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న శంకర్‌
- తన భర్తను కాపాడాలంటూ నేతలచుట్టూ తిరుగుతున్న అభాగ్యురాలు
 
గల్ఫ్‌ గడ్డపై మరో తెలంగాణ ప్రాణం గాల్లో వేలాడుతోంది. ఉపాధి వేటలో దుబాయ్‌కి వెళ్లి సంబంధం లేని హత్యకేసులో ఇరుక్కుని 9 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న ఓ అభాగ్యుడు.. ఇప్పుడు ఉరిశిక్షకు నెలరోజుల దూరంలో ఉన్నాడు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం మెండోరాకు చెందిన మాకూరి శంకర్‌ వ్యవసాయ కూలీ. ఉపాధి కోసం 2004లో దుబాయ్‌ వెళ్లాడు. ఆ సమయంలో భార్య భార్య భూ దేవి గర్భంతో ఉంది. దుబాయ్‌లో ఓ కంపెనీలో శంకర్‌ ఫోర్‌మన్‌గా చేరాడు. 2009లో అక్కడే తాపీ పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామావతార్‌ కుమావత్‌ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. దీనికి  ఫోర్‌మన్‌గా ఉన్న శంకరే కారణమంటూ పోలీసులు హత్యానేరం మోపి జైలుకు పంపించారు. దుబాయ్‌ చట్టం ప్రకారం హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష తప్పదు. కేసు విచారణ జరుగుతుండటంతో తొమ్మిదేళ్లుగా శంకర్‌ జైల్లోనే ఉన్నాడు. కొడుకు పుట్టినా కనీసం ఇప్పటి వరకు శంకర్‌ చూడలేదు. తన పరిస్థితిని కుటుం‍బసభ్యులకు వివరించి, రక్షించాలని శంకర్‌ సమాచారం అందించాడు. దీంతో అతని భార్య భూదేవి, కొడుకు రాజు రాజకీయ నాయకులు, అధికారుల చుట్టు తిరుగుతూ తన భర్తను కాపాడాలని కోరుతున్నారు. 
 
మాకూరి శంకర్‌ (ఫైల్‌ ఫొటో)
 
నెలరోజుల్లో రాకపోతే అంతే!
‘నెల రోజుల్లో క్షమాభిక్ష తీసుకురాకపోతే నీ కేసు అబుదాబీ కోర్టుకు వెళ్తుంది. అక్కడ ఉరి శిక్ష పడటం ఖాయం’అని దుబాయ్‌ కోర్టు జడ్జి శంకర్‌కు సూచించినట్లు దుబాయ్ జైలు నుంచి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో తన భర్తను కాపాడాలంటూ అతని భార్య భూదేవి, కొడుకు రాజు అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరి సమస్యను పరిష్కరించడానికి స్థానిక టీడీపీ నేత దేగాం యాదగౌడ్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతి చెందిన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు మాకూరి శంకర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు లేఖ ఇస్తే శంకర్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. గతంలో ఈ పద్ధతిలో ప్రయత్నించి ఉరిశిక్ష తప్పించుకున్న వాళ్లున్నారు. దీంతో శంకర్‌ను సైతం ఇలాగే కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శంకర్‌ భార్య భూదేవి
 
రాయబార కార్యాలయానికి లేఖ
శంకర్‌ దుబాయ్‌లోని ఇండియన్‌ ఎంబసీకి తనను కాపాడాలని లేఖ రాయడంతో అధికారులు స్పందించారు. కేంద్ర, రా‍ష్ట్ర ప్రభుత్వాలు ఎంబసీ అధికారులు లేఖలు రాశారు. తెలంగాణ సర్కారు దీనిపై రాజస్థాన్‌ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు. యాదాగౌడ్‌ గతేడాది రాజస్తాన్‌ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే ఆరున్నర లక్షలిస్తే క్షమాభిక్ష లేఖ ఇచ్చేందుకు ఆ కుటుంబం అంగీకరించింది. అయితే తినటానికే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న శంకర్‌ భార్య, కొడుకు.. అంతమొత్తం కట్టలేక తమ కుటుంబాన్ని కాపాడాలంటూ యాచిస్తున్నారు. మనసున్నోళ్లెవరైనా మెండోరాలోని శంకర్‌ను వెనక్కుతెచ్చేందుకు ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. కుటుంబం అకౌంటు వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాం. చైతనైనంత సాయం చేసి మానవత్వాన్ని బతికించుకుందాం.

Popular News may like