Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
ఇద్ద‌రిని బ‌లితీసుకున్న క‌రెంట్

జీవ‌నాధార‌మైన వృత్తే వారిని బ‌లి తీసుకుంది.. వ్య‌వ‌సాయంతో క‌డుపునింపుకుంటున్న రైతు న‌వీన్, మెకానిక్ గా బ‌తుకుతున్న భూమ‌న్న క‌రెంట్ షాక్ తో ఒకేచోట‌ మృతి చెందారు. లోకేశ్వ‌రం మండ‌లం పంచగుడి శివారులో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ప్రమాదంలో వీరిద్ద‌రు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. త‌న పొలంలో బోరు మోట‌ర్ బాగుచేస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు ఇనుప పైపు అదుపు త‌ప్పి ప‌క్క‌నే ఉన్న విద్యుత్ తీగ‌ల‌పై ప‌డ‌టంతో షాక్ త‌గిలి ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవ‌లే మోట‌రు బోరు కాలిపోవ‌డంతో సోమ‌వారం మ‌ధ్యాహ్నం బోరుబావిలో దింపేందుకు ధ‌ర్మోర గ్రామానికి చెందిన మెకానిక్ భూమ‌న్న తీసుకుని పోలానికి వెళ్లాడు. అది బిగుస్తున్న స‌మ‌యంలోనే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. 
విద్యుదాఘాతానికి గురైన భూమన్న తండ్రి ఎల్లన్న గతేడాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ షాక్‌ నుంచి కోలుకోక ముందే కరెంటు రూపంలో ఆ కుటుంభానికి ఎదురులేని దెబ్బ తగిలింది. భూమన్నకు మెకానిక్‌ వృత్తే జీవనాధారం. ఆయనకు భార్య దేవుబాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. భూమన్నపైనే కుటుంబమంతా ఆధారపడి ఉన్నారు. మ‌రోవైపు బ్యాగరి నవీన్‌కు ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న ఎకరంన్నర పొలమే ఆధారం. ఆయనకు భార్య సవిత, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం సవిత గర్భిణి. రెండు కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన వారిపైనే ఆధారపడి ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలను చూసి అక్కడికి చేరుకున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Popular News may like