Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
స్కూల్ బ‌స్ కింద ప‌డి చిన్నారి మృతి

- డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటున్న కుటుంబికులు
- పోలీసుల అదుపులో డ్రైవ‌ర్‌

రోజ‌టి లాగే పాఠ‌శాల‌కు బ‌య‌ల్దేరి ఇంటికి వ‌స్తున్నఓ చిన్నారి.. తిరిగిరాని లోకాల‌కు వెళ్లింది. ఎప్ప‌టిలాగే స్కూల్‌ బ‌స్ లో వెళ్లే ఆ చిన్నారిని ఆ బ‌స్సే చిదిమేసింది. స్కూల్ బ‌స్ కింద ప‌డి మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్మల్‌ ప‌ట్ట‌ణంలోని సోఫీన‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే ప‌ట్ట‌ణంలోని సోఫినగర్‌కు చెందిన సంతోశ్‌, చరిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. తండ్రి వృత్తిరీత్యా పెయింటింగ్‌ పనులు నిర్వహిస్తుండగా, తల్లి బీడీ కార్మికురాలు. వారి కూతురు సాన్విక(4) సమీపంలోని కృష్ణవేణి పాఠశాలలో నర్సరీ చదువుతోంది. రోజూ పాఠశాలకు చెందిన బస్సులోనే వెళ్లి వస్తుంటుంది. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం సైతం పాఠశాల బస్సులో (టీఎస్‌01యూఏ- 5950) ఇంటికి వచ్చిన బాలిక బస్సు దిగుతున్న సమయంలో కిందపడింది.

వాహనం వెనక చక్రాల కిందపడటంతో తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో బస్సును అక్కడే నిలిపేశారు. ఈలోపు అపస్మారకస్థితికి చేరుకున్న బాలికను హుటాహుటీన ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందిందని చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉండటం చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. డ్రైవ‌ర్‌ నరేశ్‌ అజాగ్రత్తగా బస్సు నడపడంతో చిన్నారి మృత్యువాత పడిందని తెలుస్తోంది. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పట్టణ సీఐ జాన్‌ దివాకర్‌ తెలిపారు.

 

Popular News may like