Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
ప్ర‌తీఒక్క‌రు ఓటింగ్‌లో పాల్గొనాలి

- జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ప్ర‌శాంతి

స‌మాజ మార్పున‌కు ఓటుహ‌క్కు ఎంతో కీల‌క‌మ‌ని, ఓటు హ‌క్కు క‌లిగిన ప్ర‌తీ ఒక్క‌రు  ఓటింగ్‌లో పాల్గొనాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ప్ర‌శాంతి అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మ‌ల్ గ్రామీణ పోలీస్‌స్టేష‌న్‌లో విశ్రాంత ఉద్యోగుల‌కు ఓటు హ‌క్కు అనే అంశంపై స‌దస్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మాలు అనే అంశంపై విశ్రాంత ఉద్యోగుల‌కు వివ‌రించారు. పోలింగ్ కేంద్రాల్లో సెక్టోర‌ల్ అధికారులను నియ‌మించ‌డం జ‌రిగింద‌ని, అలాగే వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుచేసి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని తెలుసుకుంటామ‌న్నారు.  ప్ర‌తీ ఒక్క‌రు ఓటింగ్‌లో పాల్గొని ఓటింగ్‌శాతాన్ని పెంచాల‌ని ఆమె కోరారు. అనంత‌రం జిల్లా ఎస్పీ సి.శ‌శిధ‌ర్‌రాజు మాట్లాడుతూ ఓటు హ‌క్కు క‌లిగిన ప్ర‌తీ ఒక్క‌రు నిర్భ‌యంగా, స్వేచ్చ‌గా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుని ఓటింగ్‌శాతాన్ని పెంచాల‌ని సూచించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా ప్ర‌తీ ఒక్క‌రు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఎన్నిక‌ల అధికారుల‌తో ఎవ‌రైనా దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌, గొడ‌వ‌లు చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఎక్క‌డైనా ఇబ్బందులు ఎదురైనా పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని పేర్కొన్నారు. స‌మ‌స్యాత్మ‌క ప్ర‌దేశాల‌లో ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ఈ స‌ద‌స్సులో అద‌న‌పు ఎస్పీ ద‌క్షిణామూర్తి, డీఎస్పీ ఉపేంధ‌ర్‌రెడ్డి, ప‌ట్ట‌ణ‌, గ్రామీణ సిఐలు జాన్ దివాక‌ర్‌, శ్రీ‌నివాస్‌, విశ్రాంత ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు.

Popular News may like