Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
ఆ రెండూ కుటుంబ పార్టీలే..

- టీఆర్ఎస్‌ది కూడా కాంగ్రెస్ త‌ర‌హా పాల‌నే
- ఒక్క‌సారి అవ‌కాశ‌మివ్వండి అభివృద్ధేందో చూపిస్తాం
- నిజామాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స‌భ‌ల్లో ప్ర‌ధాని మోడీ

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ కుటుంబ పార్టీలేన‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోడీ మంగ‌ళ‌వారం రెండు బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొని ప్ర‌సంగించారు. మొద‌ట నాందేడ్ నుంచి నిజామాబాద్ స‌భ‌కు వెళ్లిన మోడీ.. ప్ర‌సంగాన్ని తెలుగులో ప్రారంభించారు. అనేక బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేల ఎంతో పవిత్రమైనదని కొనియాడారు. అనంత‌రం టీఆర్ఎస్ పాల‌న తీరును దుయ్య‌బ‌ట్టారు. టీఆర్ఎస్ కూడా 50 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న త‌ర‌హాలోనే ఆలోచిస్తోంద‌ని అన్నారు. నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తానన్న‌ కేసీఆర్‌... నగరానికి క‌నీసం తాగునీటిని కూడా అందించలేద‌ని అన్నారు. న‌గ‌రంలో మురుగునీటి పారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేశార‌న్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎంగా కేసీఆర్‌ చరిత్రలో నిలుస్తారని మోడీ ఆరోపించారు. యూపీఏ హాయాంలో కేంద్ర‌ మంత్రిగా ప‌నిచేసిన కేసీఆర్.. కాంగ్రెస్‌కు వ్య‌తిరేక‌మంటే న‌మ్మ‌వ‌ద్దంటూ.. ఆ రెండు పార్టీలు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేలా దొంగాట ఆడుతున్నాయ‌ని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ఒకే స‌భ‌లో కూర్చొని కుటుంబ‌పాల‌న గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌లు రెండు కుటుంబపార్టీలే. ఈ రెండు పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు. పార్టీల విధానాల్లో కూడా పెద్దగా తేడా లేద‌ని... తప్పుడు ప్రచారంలో ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని మోడీ అన్నారు. స‌బ్ కా సాథ్ స‌బ్ కా వికాస్ అనే నినాదంతో బిజేపీ ముందుకు వెళ్తోంద‌ని.. తెలంగాణ‌లో ఈ సారి బీజేపీకి అధికార‌మిచ్చి చూడండి అంటూ మోడీ ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ స‌భ‌లో కేంద్ర మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీద‌ర్ రావు,  నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లా బిజేపీ అభ్య‌ర్థుల‌తో పాటు నిర్మ‌ల్‌, కోరుట్ల‌, జ‌గిత్యాల, ముథోల్ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థులు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

నిజామాబాద్ స‌భ త‌ర్వాత అక్క‌డి నుంచి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స‌భ‌కు చేరుకున్న న‌రేంద్ర మోడీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు రాష్ట్ర నాయ‌కులు. అనంత‌రం స‌భ‌కు చేరుకున్న మోడీ.. మార్పుకోసం తరలి వచ్చిన అందరికీ నా నమస్కారాలంటూ.. అతిథులు వచ్చి నీళ్లు అడిగితే పాలు ఇచ్చేవారు పాలమూరు వాసులంటూ ప్ర‌సంగించారు. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒక్క కుటుంబం దేశంలో తిష్టవేసుకుని కూర్చొందని... నయా తెలంగాణలో కూడా గత నాలుగున్నరేళ్లుగా ఒకే కుటుంబ తిష్ట వేసుకుని కూర్చొందంటూ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అంటోంది. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కూడా ఇదే చేస్తోందని అన్నారు. ఇక్కడున్న నాయకులకు ఏది పడితే అది మాట్లాడటం అలవాటైపోయిందని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు నాణేనికి ఉన్న బొమ్మా బొరుసువంటివ‌ని.. అందుకే బిజేపీకి ఓటేసి తెలంగాణ‌లో  బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించండని కోరారు. ఈ స‌భ‌లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మణ్, తాజా మాజీ ఎమ్మెల్యే కిష‌న్ రెడ్డిల‌తో పాటు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా బిజేపీ అభ్య‌ర్థులు ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

Popular News may like