Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
మమత మీది నోరేనా.. లేక!

- అప్పుడు బంగ్లా శరణార్థులను ఉగ్రవాదులని చెప్పి..
- నేడు రక్తపాతం, పౌరయుద్ధం అంటూ డ్రామాలా?

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పచ్చి రాజకీయ అవకాశ వాది. ఎంతలా అంటే.. ఒకప్పుడు తనకు ఓటుబ్యాంకు కాదని రచ్చ చేసిన అంశాన్నే ఇప్పుడు అయ్యో అన్యాయం జరుగుతోందంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అస్సాం ఎన్నార్సీ తుది ముసాయిదా విడుదలైనప్పటినుంచీ అందరికంటే ఎక్కువగా గుండెలు బాదుకుంటున్నది మమత ఒక్కరే. ఏ పార్టీ దీనిపై సీరియస్‌గా స్పందించడం లేదు. చివరకు అస్సాం కాంగ్రెస్‌ చీఫ్‌ కూడా మమత వ్యాఖ్యలను తప్పుబట్టారు. బంగ్లాదేశీయులు అక్రమంగా అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో ఉంటున్నారనేది సుస్పష్టం. వారిని పంపకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అందుకే కేంద్రం ఎన్నార్సీపై జాగ్రత్తగానే అడుగులు వేస్తూ వచ్చింది. దీనికితోడు సుప్రీంకోర్టు కూడా ఎన్నార్సీని వేగవతం చేయాలని.. స్వయంగా తామే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తామని చెప్పడంతో బీజేపీకి స్వామి కార్యం.. సకార్యం కలిసొచ్చినట్లయింది. అయితే అస్సాం అనంతరం పశ్చిమబెంగాల్‌లోనే ఎన్నార్సీ జాబితా సిద్ధం చేసే పరిస్థితులుండటంతో మమత ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఎన్‌ఆర్‌సీ తెరపైకి తెచ్చిందని మండిపడుతున్నారు. బంగ్లాదేశీయుల్ని దేశం నుంచి వెనక్కి పంపిస్తే అంతర్యుద్ధం చెలరేగి రక్తపాతానికి దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. కానీ ఈ మమతే 13 ఏళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇదే వలసదారులను వెళ్లగొట్టాలంటూ పార్లమెంటులో నానా రచ్చ చేశారు. 

నాడు అక్రమ వలసలు విధ్వంసమని..
2005లో ఎంపీగా ఉన్న మమత బంగ్లాదేశ్‌ నుంచి అక్రమవలసలు విధ్వంసంగా మారాయంటూ పార్లమెంటులో లేవనెత్తారు. ఈ చొరబాట్లు అత్యంత ఆందోళనకర అంశమని, దీనిపై చర్చ జరగాలంటూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వలసదారులకు ఓటు హక్కు ఉండడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే  దీన్ని స్పీకర్‌ తిరస్కరించారు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం అధికారంలో ఉంది. దీంతో మమత మరింత రెచ్చిపోయారు. వలసదారులతో ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నా పట్టించుకోవడం లేదంటూ డిప్యూటీ స్పీకర్‌ చరణ్‌జిత్‌ సింగ్‌ అత్వాల్‌పై తన చేతిలో ఉన్న పేపర్ల కట్ట విసిరికొట్టారు. దీంతో నాటి సభ నివ్వెరపోయింది. ఇదే జోరులో ఆమె ఎంపీ పదవికీ రాజీనామా చేసినా ఆమోదం పొందలేదు. అప్పట్లో బంగ్లాదేశ్‌ ముస్లింలు సీపీఎంకు బలమైన ఓటు బ్యాంకు. అదే మమత ఆగ్రహానికి కారణం. వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, వారంతా సామాజిక ఉగ్రవాదులుగా మారుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. కమ్యూనిస్టులు బెంగాల్‌లో అంతరించిపోయే దశకు చేరడంతో బంగ్లా ముస్లింలు తృణమూల్‌ వైపు వచ్చారు. వారంతా ఇప్పుడు టీఎంసీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అందుకే మమత ఈ అక్రమ వలసదారుల ప్రయోజనాలను కాపాడడానికి అర్థంలేని పోరాటానికి సిద్ధపడ్డారు.

 

Popular News may like