Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
మీ పాపాలను మేం భరిస్తున్నాం!

- దేశాన్ని ఇష్టమొచ్చినట్లు ముక్కలు చేశారు
- మూడున్నరేళ్లు ఓపికగా ఉన్నా.. 
 దుష్ప్రచారం కారణంగానే ‍ప్రజలకు వాస్తవాలు చెబుతున్నా
- బ్యాంకులపై ‘ఎన్‌పీఏ’లతో ఒత్తిడి.. ఖజానాపై రూ.52 లక్షలకోట్ల భారం
- పటేల్‌ను ప్రధాని కాకుండా అడ్డుకున్నారు.. లేదంటే కశ్మీర్‌ సమస్య ఉండేది కాదు
- కుటుంబ సేవలో తరించి.. దేశసంక్షేమాన్ని విస్మరించారు
- ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ నినాదం మహాత్ముడిదే
- పార్లమెంటులో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ 
- గతాన్ని పక్కనపెట్టి నవభారతం కోసం పనిచేద్దామని విపక్షాలకు పిలుపు
 
 
న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్‌, యూపీఏ పాలనపై ప్రధాని నరేంద్ర నిప్పులు చెరిగారు. రాజకీయ స్వలాభం కోసమే దేశాన్ని ముక్కలు ముక్కలు చేశారని.. ప్రధాని తీవ్రంగా విమర్శించారు. బ్యాంకులపై ఎన్‌పీఏల రూపంలో కాంగ్రెస్‌ చేసిన పాపాల ప్రభావాన్ని ఇప్పటికీ దేశం అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. అయితే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ రాజకీయ స్వలాభం కోసం అశాస్త్రీయంగా విభజించిందని.. దీని కారణంగానే నేటికీ సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ పిలుపునిచ్చింది మోదీ కాదని.. మహాత్మాగాంధీయేనన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితి, కుంభకోణాలు, అమయక సిక్కుల హత్యలున్న పాత భారతాన్నే కాంగ్రెస్‌ కోరుకుంటోందని.. తమ ప్రభుత్వం మాత్రం నవభారత నిర్మాణం కోసం పనిచేస్తోందన్నారు. 
 
 
ఓ కుటుంబ సేవలో..
‘భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత.. స్వేచ్ఛావాయువులు పీల్చిన పలు దేశాలు అభివృద్ధిలో మనకన్నా వేగంగా ముందుకెళ్తున్నాయి. మనమింకా వెనుకబడే ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి తల్లి భారతిని ముక్కలు ముక్కలు చేశారు. అయినా.. మొదట్నుంచీ దేశం మీ వెంటే ఉంది. 4-5 దశాబ్దాల వరకు నామమాత్రమైన విపక్షం.. మీడియా ప్రభావం లేకపోవటం వంటివి మీకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. న్యాయవ్యవస్థ ఉన్నతస్థానాల్లో మీకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అసలు మీకు ఎదురే లేని పరిస్థితి. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మీ జెండానే ఎగిరింది. ఇంత స్వేచ్ఛ ఉన్న సమయంలోనూ మీరు చేసిందేంటి? దేశ సౌభాగ్యం, అభివృద్ధిని విస్మరించి.. ఒక కుటుంబం సేవలో తరించటంలోనే సమయాన్ని వ్యర్థం చేశారు. మీ శక్తినంతా అందులోనే ధారపోశారు. అదే సమయంలో మీరు దేశం గురించి బాధ్యతగా పనిచేసి ఉంటే.. ఇప్పుడు మనమెక్కడో ఉండేవాళ్లం’ అని ప్రధాని పేర్కొన్నారు. 
 
మూడున్నరేళ్లు ఓపికగా ఉన్నా..
దేశవ్యాప్తంగా నిరర్థక ఆస్తులపై ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందన్నారు. అసలు కాంగ్రెస్‌ హయాంలో చేసిన పాపాల ఫలితాన్నే ఇప్పటికీ దేశం అనుభవిస్తోందన్నారు. ‘అధికారంలోకి రాగానే ఎన్‌పీఏలపై యూపీఏ ప్రభుత్వం చెప్పిన దానికీ.. వాస్తవ పరిస్థితులకూ చాలా తేడా ఉన్నట్లు అర్థమైంది. నేను రాజకీయాలే చేయాలనుకుంటే అప్పుడే ప్రజలకు వివరించేవాడిని. కానీ అలా చేస్తే బ్యాంకుల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని మాట్లాడలేదు. ఎన్‌పీఏల పేరుతో ఓ పద్ధతి ప్రకారం ఖజానాను లూటీ చేశారు. బ్యాంకులపై ఒత్తిడి చేసి తమ నేతలకు (సంస్థలు, ఫ్యాక్టరీలకు) రుణాలివ్వాలని ఆదేశించారు. అలా బ్యాంకుల నుంచి వెళ్లిన డబ్బు తిరిగిరాలేదు. ఎప్పటికప్పుడు ఆ రుణాలను పునర్వ్యవస్థీకరిస్తూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు’ అని మోదీ పేర్కొన్నారు. తను ఇన్నాళ్లుగా ఓపికగా ఉన్నానని.. ఇకనైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలనే ఈ విషయాన్ని వెల్లడించానన్నారు. ‘మేం అధికారంలోకి రాకముందు 36 శాతం ఎన్‌పీఏలున్నాయన్నారు. తీరా మేమొచ్చాక అవి 82 శాతమని తేలింది. 2008 మార్చి వరకు ఇలాంటి ఎన్‌పీఏలకు రూ.18లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు రుణాలుగా ఇప్పించారు. 2014 నాటికి ఇది రూ.52 లక్షల కోట్లకు చేరింది. అప్పనంగా దేశ ప్రజల సొమ్మును వాడుకున్నారు’ అని మోదీ వెల్లడించారు. ఎన్‌పీఏలు పూర్తిగా కాంగ్రెస్‌ చేసిన పాపమేనని.. ఈ పాపాలను తమ ‍ప్రభుత్వం మౌనంగా భరిస్తూ వస్తోందని ప్రధాని అన్నారు. దీనిపై ప్రజలకు కాంగ్రెస్‌ లెక్కలు అప్పజెప్పాలన్నారు.
 
 
మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది?
ఆగస్టు 15, 1947 తర్వాతే దేశంలో ప్రజాస్వామ్యమనే పదం తెలిసిందని.. అంతకుముందు దేశానికి అస్తిత్వమే లేదని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూలే దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చారనటంలో అర్థం లేదన్నారు. ‘మన దేశంలో బౌద్ధమతం విరాజిల్లుతున్న సమయంలోనే ప్రజాస్వామ్యం విరాజిల్లింది. కర్ణాటకలో 12వ శతాబ్దంలోనే జగద్గురు బసవేశ్వరుడు ప్రజాస్వామ్యాన్ని అమలుచేశారు. ‘అనుభవ్‌ మండపం’ను ఏర్పాటుచేసి అందరికీ న్యాయం చేసేవారు. ఈ మండపంలో మహిళకు ప్రాతినిధ్యం ఉండేది. ఇది తెలిసీ.. బసవేశ్వరుడిని కాంగ్రెస్‌ నేతలు అవమానించటం తగునా? 2500 ఏళ్లకు పూర్వమే దేశంలో ప్రజసామ్య పాలన జరిగింది’ అని మోదీ తెలిపారు. జహంగీర్‌ స్థానంలో షాజహాన్‌.. ఆయన స్థానంలో ఔరంగజేబ్‌ ఇలా పారంపర్యంగా పగ్గాలందినట్లే.. కాంగ్రెస్‌ పార్టీకీ గాంధీ కుటుంబానికే అధ్యక్ష బాధ్యతలు అందుతాయని.. ఎన్నికలంటూ ఉండవని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చేసిన వ్యాఖ్యలనూ ప్రధాని గుర్తుచేశారు. ఇదేనా ప్రజాస్వామ్యమని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. 
 
పటేల్‌ ప్రధాని కాకుండా అడ్డుకున్నారు. లేదంటే..!
స్వాతంత్ర్యం వచ్చాక అప్పటికి దేశవ్యాప్తంగా ఉన్న 15 కాంగ్రెస్‌ కమిటీల్లో 12 కమిటీలు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను ప్రధాని చేయాలని ఓటేశారని మోదీ తెలిపారు. అయినా పటేల్‌ను పక్కనపెట్టి నెహ్రూకు పగ్గాలు కట్టబెట్టిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఒకవేళ పటేల్‌ తొలి ప్రధాని అయ్యుంటే ఇవాళ కశ్మీర్‌​సమస్యే ఉండేది కాదని.. భారత్‌లో అంతర్భాగమై ‍ప్రశాంతంగా ఉండేదని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని కలిపేందుకు పటేల్‌ ప్రయత్నిస్తే.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ముక్కలు ముక్కలుగా విడగొట్టిందని ప్రధాని మండిపడ్డారు. ‘మనకు వ్యతిరేకంగా ఓ గళం లేస్తుంటే.. దాన్ని వినేందుకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కాంగ్రెస్‌ పార్టీకి లేదు’ అని ఆయన తెలిపారు. దేశంలో 90 కన్నా ఎక్కువ సార్లు ఆర్టికల్‌ 365ను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌.. రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార పార్టీలను పక్కన పడేశారనిజజ పంజాబ్‌, తమిళనాడు, కేరళల్లో ప్రజాస్వామ్యాన్ని బతకనీయలేదని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యంపై దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. యూపీఏ హయాంలో కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ పదాధికారి ఒకరు (పరోక్షంగా రాహుల్‌ గాంధీని సంబోధిస్తూ) మీడియా సాక్షిగా చించేయటమే ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ విభజనపై..
రాష్ట్రపతి ప్రసంగం ‍ప్రభుత్వం చేసిన పనులను వెల్లడిస్తుందని.. దీన్ని కూడా విమర్శించటం ఆయా పార్టీల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశ విభజన నుంచి నేటి వరకు రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌ చేసిన పాపాల కారణంగా సమస్యల్లేని రోజు లేదని ప్రధాని తీవ్రంగా దుయ్యబట్టారు. ‘వాజ్‌పేయి హయాంలో మేం ఉత్తరాఖండ్‌ (యూపీ నుంచి), ఛత్తీస్‌గఢ్‌ (మధ్యప్రదేశ్‌), జార్ఖండ్‌ (బిహార్‌) అనే మూడు రాష్ట్రాలను విభజించాం. వివాదాల్లేకుండా ఎవరికి చెందాల్సినవి వారికి అందించాకే విభజించాం. కానీ మీరు మాత్రం.. ఎన్నికల్లో రాజకీయలాభం లేకుండా ఏ పనీ చేయలేదు. ఏపీ విషయంలో ఎలాంటి చర్చా జరగకుండానే విభజించారు. ఆంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించలేదు. మేమూ తెలంగాణను కోరుకున్నాం. అందుకోసం మద్దతిచ్చాం. కానీ సరైన పద్ధతిలో మీరు విభజన జరపలేదు’ అని మోదీ పండిపడ్డారు.
 
చెప్పటం కాదు చేసి చూపిస్తాం
2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త పనిసంస్కృతిని తీసుకొచ్చిందని ప్రధాని తెలిపారు. ‘మాటలు చెప్పటం, ప్రధాన శీర్షికల్లో వార్తలు వేయించుకోవటం మా ఉద్దేశం కాదు. ప్రజలను మభ్యపెట్టకుండా చేతుల్లోకి తీసుకున్న పనిని పూర్తిచేయటమే మా లక్ష్యం. దేశానికి నష్టం చేసే వారెవరైనా.. ఏ పనైనా దార్లోపెట్టి ప్రజాసంక్షేమం కోసం నడిపిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలో మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేస్తున్న పథకాలు, పనుల అమలుతీరును ఆయన వెల్లడించారు. రోడ్లు, రైళ్ల ట్రాక్‌ల నిర్మాణం, లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్‌ ఫైబర్‌తో అనుసంధానం చేయటం, 4,320 గ్రామాల్లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన అమలు, విద్యుదుత్పత్తి సామర్థ్యం తదితర అంశాలను మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేసి ఉంటే విపక్ష హోదాకూడా లేని దుస్థితి పట్టి ఉండేది కాదన్నారు. చేయని పనులకు శంకుస్థాపనలు చేసి జెండాలు ఊపి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టారని.. దీనికి 2014లో ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. అధికార పార్టీ, విపక్ష పార్టీ సభ్యులనే తేడా లేకుండా.. ప్రజలకోసం అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘దేశంలో అతిపెద్ద సొరంగం, అతిపెద్ద గ్యాస్‌పైప్‌లైన్‌. అతిపెద్ద​ సముద్రపు రైలు, వేగవంతమైన రైలు మేం తీసుకొస్తున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. 
 
ఉపాధికల్పన లెక్కలివీ!
దేశంలో ఉపాధికల్పన స్తంభించిందని.. లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారంటే విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. ఇటీవల వెల్లడవుతున్న లెక్కలు చేస్తే ఉపాధి కల్పన ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయన్నారు. ‘గత 3-4 ఏళ్లలో తమ తమ రాష్ట్రాల్లో కోటిమందికిపైగా ఉపాధి దొరికిందని పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు స్వయంగా చెప్పాయి. ఇవేవీ ఎన్డీయే, బీజేపీ ప్రభుత్వాలు కాదు. ఈ లెక్కలను కూడా ఒప్పుకోలేరా? దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దు. 70 లక్షల కొత్త ఈపీఎఫ్‌లు నమోదయ్యాయి. వీరంతా 18-25ఏళ్లలోపు వారే. ఇది ఉద్యోగం కాదా?’ అని మోదీ ప్రశ్నించారు. ఉద్యోగం అడుక్కునే పరిస్థితుల్లో దేశ యువత లేదని.. స్వయం ఉపాధిని సృష్టిస్తూ దూసుకుపోతోందని ప్రధాని ప్రశంసించారు. స్టార్టప్‌ల ఆలోచన, అమలుపై యువత చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. 10కోట్లకు పైగా యువకులకు రూ.4లక్షల కోట్ల రుణాలివ్వటం ద్వారా స్వయం ఉపాధీ పెరిగిందన్నారు. కళ్లు మూసుకుని.. కుటుంబం సేవ చేసేవారు వాస్తవాలను స్వీకరించలేని స్థితి ఉన్నారన్నారని విమర్శించారు. ‘చిన్న మనసుతో ఎవరూ పెద్దోళ్లు కాలేదు.. విరిగిన మనసుతో సమాజంలో నిలబడలేర’నే వాజ్‌పేయి కవితను మోదీ ప్రస్తావించారు.
 
21వ శతాబ్దపు ఆలోచనలేవీ?
ఎప్పుడు కాంగ్రెస్‌నేతలు ‘మా జమానాలో’ అని చెప్పుకుంటుంటారని మోదీ ఎద్దేవా చేశారు. 80వ దశకంలో 21వ శతాబ్దం అని వచ్చేస్తోందని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు.. కనీసం 21వ శతాబ్దపు ఏవియేషన్‌ పాలసీని కూడా తీసుకురాలేకపోయారన్నారు. ‘ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఏవియేషన్‌ పాలసీ వల్ల చిన్న చిన్న నగరాల్లో 16 కొత్త విమానాశ్రయాలు నిర్మితమై.. విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. 80కిపైగా కేంద్రాల్లో త్వరలోనే విమానం ఎగరనుంది. దేశంలో ఇప్పడు 450 విమానాలు తిరుగుతున్నాయి. ఈ ఏడాది 900పైగా కొత్త విమానాలకోసం ఆర్డర్లు వెళ్లాయి’ అని ప్రధాని తెలిపారు. ప్రభుత్వం సాంకేతికత ద్వారా ప్రతి కార్యక్రమ అమలుతీరును సమీక్షిస్తోందని.. దీని కారణంగానే పారదర్శకత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
 
నాడు అనుమానాలు.. నేడు విమర్శలా?
ఎన్డీయే ‍ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆధార్‌ వ్యవస్థను రద్దుచేస్తారంటూ కాంగ్రెస్‌ విషప్రచారం చేసిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం మరో అడుగుముందుకేసి ఆధార్‌ సాంకేతికతను సరిగ్గా వినియోగించుకుంటుండటం వల్ల విపక్షాలు అసహనంతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇప్పడు 115 కోట్ల మంది భారతీయులకు ఆధార్‌లున్నాయని.. 400 కేంద్ర పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పుట్టని బిడ్డకూ వితంతు పింఛన్‌లు కేటాయించి.. మధ్యవర్తులైన నాయకులు పండగ చేసుకున్నారని ఆరోపించారు. అవినీతిపరుల, దోపిడీ దారుల ఉపాధి తగ్గిపోయిందని కాంగ్రెస్‌, విపక్షాలు బాధపడుతున్నాయన్నారు. నాలుగు అంశాల (ఉత్పత్తి,సరఫరా, పంపిణీ, కనెక‌్షన్‌)పై విశేషంగా కృషిచేసి 4కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నామన్నారు. 28కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయటం ద్వారా.. రూ.15వేల కోట్ల విద్యుత్‌ బిల్లులు ఆదా అయిందన్నారు. 
 
రైతుల పేరుతో రాజకీయాలా?
దేశ వెన్నెముక అయిన రైతులను ఇన్నాళ్లూ విస్మరించిన పార్టీలు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నాయని మోదీ మండిపడ్డారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా రైతుల ఉత్పత్తులు వినియోగదారుల వద్దకు చేరటంలో సరైన వసతులు కల్పించటంలో కాంగ్రెస్‌ దారుణంగా విఫలమైందన్నారు. తమ పార్టీ చేపట్టని పథకాల ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు మార్గం సుగమమైందని.. దీని ద్వారా ఉపాధి కూడా పెరుగుతోందన్నారు. పాడిపరిశ్రమకోసం కామధేను విధానం తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ సంస్కరణల ద్వారా 2022 కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపుచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. 
 
ఎవరినీ వదిలిపెట్టబోం!
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అవినీతి కేసుల్లో జైలుకెళ్లారని మోదీ పేర్కొన్నారు. తప్పుచేసి, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారెవ్వరూ తప్పించుకోలేరన్నారు. దేశాన్ని లూటీ చేసిన వారంతా.. దోచుకున్నది తిరిగివ్వాల్సిందేనని ఈ ప్రయత్నంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో న్యాయపూరిత వాతావరణం నెలకొన్నందునే చాలా మంది ఆదాయపుపన్ను చెల్లించేందుకు ముందుకొస్తున్నారన్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పటం ద్వారా వాస్తవాలను తప్పులుగు చూపే ప్రయత్నం జరుగుతోందని.. దీన్ని మానుకోకపోతే నష్టపోయేది మీరేనని కాంగ్రెస్‌ను హెచ్చరించారు.
 
 
విదేశాల ఒప్పందాల్లోనూ లాలూచీ
ఖతర్‌తో యూపీఏ ప్రభుత్వం గ్యాస్‌ ఒప్పందం చేసుకుందని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక దీన్ని గౌరవిస్తూనే కొనసాగించామన్నారు. కొన్ని అంశాల్లో వారితో చర్చలు జరపటం ద్వారా రూ.8వేల కోట్లు ఆదా అయ్యాయని ప్రధాని తెలిపారు. ఆస్ట్రేలియాతో గ్యాస్‌ ఒప్పందం విషయంలోనూ కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని మోదీ పేర్కొన్నారు. అక్కడ కూడా రూ.4వేల కోట్లను ఆదా చేశామన్నారు. దీని ద్వారా ఎవరికి లాభం జరిగింది? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ఎవరికిచ్చారు? ఎలా ఇచ్చారు? అనే అంశాలను దేశమే నిర్ణయించాలన్నారు. దీనికి కాంగ్రెస్‌ సమాధానం ఇస్తుందని ఆశించటం లేదన్నారు. ఎల్‌ఈడీ బల్బులు, సౌరవిద్యుత్‌ కొనుగోలు విషయంలోనూ భారీగా అవినీతి జరిగిన విషయాన్ని మోదీ వెల్లడించారు. దీన్ని ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 
 
విపక్షం బాధ్యత ఇదేనా?
ప్రజాస్వామ్యంలో విపక్షం పాత్ర కీలకంగా ఉంటుందని.. ఇందుకు తగ్గట్లుగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ సభ్యులకు మోదీ సూచించారు. ‘కాంగ్రెస్‌ బురదజల్లుతున్న కొద్దీ కమలం వికసిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘భారత సైనికులు సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తే.. దీనిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తారా?’ అని ప్రశ్నించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. బ్రిక్స్‌, ఆఫ్రో-ఏషియన్‌ ఇలా ఎన్నో సదస్సులు జరిగాయని, తాజాగా ఆసియాన్‌ దేశాల సదస్సులోనూ త్రివర్ణం రెపరెపలాడిందన్నారు. ‘మా ‍ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సార్క్‌ దేశాల ప్రతినిధులు వచ్చారు. అదీ మా దౌత్యనీతి’ అని మోదీ పేర్కొన్నారు. వివేకానందుడు, మహాత్ముడు, రాష్ట్రపతి ఇలా అందరూ నవభారత స్వప్నాన్ని చూశారని.. దీని నిజం చేసేందుకు అందరూ కలిసిరావాలన్నారు. విమర్శ ప్రజాస్వామ్యానికి బలమని.. కానీ అబద్ధాలను ప్రచారం చేయటం సరికాదన్నారు. 
 
రండి కలసి పనిచేద్దాం
రాజ్యసభలోనూ కాంగ్రెస్‌ తీరుపై మోదీ నిప్పులు చెరిగారు. ఆత్యయిక పరిస్థితి, బోఫోర్స్‌, హెలికాప్టర్‌ కుంభకోణాలు, సిక్కులపై హింస వంటివున్న పాత భారతాన్ని కాంగ్రెస్‌ కోరుకుంటోందని.. కానీ తమ ప్రభుత్వం ‘నవభారత’ నిర్మాణానికి కృషిచేస్తోందన్నారు. ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ నినాదాన్ని తీసుకొచ్చింది మహాత్మాగాంధీయేనని మోదీ పేర్కొన్నారు. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ అవసరం లేదని గాంధీ అభిప్రాయపడ్డారు. అందుకే కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదం మోదీది కాదు. మహాత్మాగాంధీదే’ అని ప్రధాని తెలిపారు. ఇందిరా గాంధీ హత్యానంతరం రాజీవ్‌ గాంధీ అమాయకుల సిక్కులను చంపటాన్ని చిన్న విషయంగా కొట్టిపడేసిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ‘పెద్ద వృక్షం కూలినపుడు..’ అన్న రాజీవ్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇదే కాంగ్రెస్‌ కోరుకుంటున్న భారతమని ఎద్దేవా చేశారు. నిర్ణీత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగానే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తమ ప్రభుత్వం ‘పథకాల పేర్లు మార్చేది కాదని.. లక్ష్యాలను మార్చి చేరుకునేద’ని మోదీ పేర్కొన్నారు. విపక్షాలు ఓబీసీ, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లులకు మద్దతివ్వాలని ఆయన కోరారు. పార్లమెంటు, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపైనా నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. ప్రభుత్వం పథకాలు, వాటి అమలుపై సలహాలను స్వీకరిస్తుందని.. సభ్యులంతా పేదలు, దేశం కోసమే పనిచేస్తున్నామనే విషయాన్ని మరవొద్దన్నారు.

Popular News may like