Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
నూనె గింజ‌ల సాగు విస్తీర్ణం పెంచాలి
నూనె గింజ‌ల సాగు విస్తీర్ణం పెంచాలి
- నూనె గింజ‌ల సాగుపై రైతుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు 
- స‌ద‌స్సులో పాల్గొన్న జాతీయ సంచాల‌కులు
దేశంలో నూనెల కొరత ఏర్పడటంతో విదేశాల నుంచి 58 వేల కోట్ల లీటర్‌ల నూనె దిగుమతి చేసుకోవల్సిన పరిస్థితి నెలకొందని నూనె గింజల విత్తన పరిశోధన సంస్థ జాతీయ కమిటీ సభ్యుడు అయ్యన్నగారి భూమయ్య అన్నారు. నిర్మ‌ల్ మండలం చిట్యాల్ గ్రామ శివారులో పరిశోధ‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో నూనెగింజ‌ల సాగుపై రైతుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి జాతీయ సంచాలకుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అయ్య‌న్న‌గారి భూమ‌య్య ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. దేశంలో నూనె గింజల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని దీంతో దేశ ప్రజలకు వంట నూనె దొరకడం కష్టంగా మారిందన్నారు. ఫలితంగా కల్తీ నూనె మార్కెట్లోకి వచ్చి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నూనె సంబంధిత పంటలు వేయాలని విత్తనాలను రైతులు తయారు చేసుకోవాలని సూచించారు. ఈ పంటలు సేద్యం చేసే రైతులను ప్రోత్సహించి రాయితీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని.. దాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్తలు ప్రభాకర్‌రావు, రంగానాథ్‌, సతీష్, మూర్తి, వ్యవసాయ శాఖ డీడీ కోటేశ్వర్‌రావు, ఏడీఏ వినయ్‌బాబు, పలు గ్రామాలకు చెందిన దాదాపు రెండు వంద‌ల మంది రైతులు పాల్గొన్నారు.
Read More
5 వేల ఎక‌రాల‌కు ఒక ఏఈవో
5 వేల ఎక‌రాల‌కు ఒక ఏఈవో
- వ్య‌వ‌సాయ రంగం మరింత‌ ప‌టిష్టం
- కొత్త ఏఈవోల‌కు నియామ‌క ప‌త్రాలిచ్చిన మంత్రి
రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగాన్ని ప‌టిష్టవంతం చేయ‌డ‌మే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద్దేశం అని అన్నారు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. సోమ‌వారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో నూత‌నంగా నియ‌మింప‌బ‌డిన 52 మంది వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారుల‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్య‌వ‌సాయ రంగ‌మును ప‌టిష్టం చేసి రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని అన్నారు. ప్ర‌తీ 5 వేల ఎక‌రాల సాగుకు ఓక ఏఈవోని నియ‌మించ‌డం జ‌రిగింద‌ని, వారు  రైతులంద‌రికి అందుబాటులో ఉండాల‌ని మంత్రి తెలిపారు. అదునాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులను సాధించేలా కృషి చేయాలన్నారు.
జిల్లాలో ఏఈవో పోస్టులు భ‌ర్తీ కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు క‌లెక్ట‌ర్ ఇలంబ‌రితి. నిర్మ‌ల్ జిల్లాలో 60 శాతం మంది వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి ఉన్నార‌ని అన్నారు. ఏఈవోలు రైతుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉంటూ వారికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, డీఏవో గంగారాం, ఏడీ కోటేశ్వర్ రావు, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Read More
రైతు వేణుగోపాల్ రెడ్డికి స‌న్మానం
రైతు వేణుగోపాల్ రెడ్డికి స‌న్మానం

మొక్క‌జొన్న సాగులో అధిక దిగుబ‌డి సాధిస్తూ ఇత‌ర రైతుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామానికి చెందిన రైతు వేణుగోపాల్ రెడ్డి. రెండెకరాల్లో మొక్క‌జొన్న పంట వేసి మంచి దిగుబ‌డి సాధించిన వేణుగోపాల్ రెడ్డిని స‌న్ క్రాప్ సీడ్స్ కంపెనీ స‌త్క‌రించింది. చించోలికి వ‌చ్చిన కంపెనీ ఏరియా సేల్స్ మేనెజ‌ర్ గోపాల్ రెడ్డి ఆయ‌న్ను స‌న్మానించారు. త‌మ కంపెనీ సీడ్స్ వారిన వేణుగోపాల్ రెడ్డి ఎక‌రాకి 40 నుంచి 45 క్వింట‌ళ్ల దిగుబ‌డి తీసుకొచ్చార‌ని.. ఆయ‌న మిగ‌తా రైతుల‌కి ఆద‌ర్శ‌మ‌ని గోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కంపెనీ ఎస్ వో రాజేందర్, శ్రీరామ్, న‌ర్సింములు, ఆర్గానిక్ ఫార్మ‌ర్ మ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు సారంగాపూర్, నిర్మల్ మండ‌లాల‌కు చెందిన రైతులు, చించోలి గ్రామ పెద్ద‌లు పాల్గొన్నారు.

Read More
సేంద్రీయమే బహుబాగు
సేంద్రీయమే బహుబాగు
రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే అధిక లాభాలను పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌ మండలంలోని అంకోలి గ్రామంలో మన తెలంగాణ- మన వ్యవసాయం కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. , వ్యవసాయ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని.. భూసార పరీక్షలతోనే రైతులు తమ పంటల్లో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం భూసార పరీక్ష రైతుల పొలాల వద్దనే నిర్వహించేలా సంచార భూసార కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
మనతెలంగాణ-మనవ్యవసాయం వాహనాన్నిప్రారంభిస్తున్నమంత్రి జోగు రామన్న
 
పాలీహౌజ్‌ పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 98 శాతం రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి వర్మికంపోస్ట్‌, పశువుల పేడ వంటి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. త్వరలో వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని జిల్లాలో వెయ్యి మందిని నియమించనున్నట్లు వివరించారు.
Read More
వ్యవసాయం 'సేంద్రియ'మవ్వాలి
వ్యవసాయం 'సేంద్రియ'మవ్వాలి
ఈశాన్య రాష్ట్రం సిక్కింను దేశంలోనే తొలి సంపూర్ణ సేంద్రియ రాష్ట్రంగా ప్రధాని మోదీ ప్రకటించారు. త్వరలో సేంద్రీయ వ్యవసాయంలో దేశానికే కాదు ప్రపంచానికే సిక్కిం దిక్సూచిగా మారుతుందంటూ నేపాలీ భాషలో అభినందనలు తెలిపారు. సిక్కింను సుఖిస్తాన్‌గా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘ఆర్గానిక్ సర్టిఫికెట్’ను సిక్కిం సీఎం చామ్లింగ్‌కు అందజేశారు.  రాష్ట్రంలో విమానాశ్రయ ఏర్పాటుపై సంకేతాలిచ్చారు. విమానాశ్రయం ఉంటే సిక్కిం స్పెషల్ పూలు సహా సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభమవుతుందన్నారు.  గ్యాంగ్‌టక్‌లో సమ్మిళిత వ్యవసాయం, రైతుల సంక్షేమం’ అంశంపై జరిగిన జాతీయ సదస్సునుద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. సదస్సులో దాదాపు అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు.  సేంద్రియ వ్యవసాయ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే, రైతులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్స్, ఆన్‌లైన్ మండీలు.. మొదలైన సాంకేతిక ఆవిష్కరణలు రావాలన్నారు.  ప్రకృతి ప్రకోపాలతో కుదేలవుతున్న రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై దృష్టి పెట్టాలంటూ ఓ సూచన చేశారు. ‘మీ భూమిని మూడు భాగాలు చేసుకోండి. ఒక భాగంలో పంటలు వేయండి. మరో భాగంలో కలప కోసం చెట్లు పెంచండి. మూడో భాగాన్ని పశువుల పెంపకం కోసం వినియోగించండి. పంటలు సరిగ్గా పండని సమయంలో మిగతా రెండు మీకు ఆర్థికంగా సహకరిస్తాయి’ అని మోదీ సూచించారు. రైతులు, సాగు, గ్రామాలు.. వీటిని వేర్వేరుగా చూడడం వల్ల అభివృద్ధి చెందలేమని, వీటన్నిటి సమ్మిళితంగా వ్యవసాయాన్ని చూసే దృష్టికోణం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. 
 
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే వ్యవసాయంలో సిక్కిం రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం విజయగాధను ప్రశంసిస్తూ.. అది అంత సులభంగా సాధించే ఘనత కాదన్నారు. ‘సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాలనుకున్నప్పుడు కొందరినుంచి వ్యతిరేకత వచ్చి ఉంటుంది. కానీ సిక్కిం రైతులు వెనకడుగు వేయలేదు. దశాబ్దం పాటు తమ ఆలోచననే నమ్ముకుని విజయం సాధించారు’ అని కొనియాడారు. సిక్కిం విజయాన్ని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ‘100-150 గ్రామాలున్న ఒక జిల్లానో, తాలూకానో ఎంపిక చేసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించండి. అక్కడ విజయవంతం అయితే, రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. నాయకులు, శాస్త్రజ్ఙులు చెప్పే ప్రసంగాలను రైతులు నమ్మరు. వారు ప్రత్యక్షంగా చూస్తేనే నమ్ముతారు’ అన్నారు. సేంద్రీయ పంటలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్న మోదీ.. ఆ మార్కెట్ దిశగా రాష్ట్రాలు దృష్టి పెట్టాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల రెండ్రోజుల పర్యటనలో భాగంగా  సిక్కిం చేరుకున్న ప్రధానికి గవర్నర్ పాటిల్, సీఎం స్వాగతం పలికారు. మంగళవారం రిడ్జ్ పార్క్‌లో నిర్వహించనున్న ఉద్యాన, పూల ఉత్సవంలో ప్రధాని పాల్గొంటారు.
 
 ‘వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధించాలి’
 
వ్యవసాయ రంగంలో సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. సవాళ్లను ఎదుర్కొని సాగు రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు. నిలకడైన వ్యవసాయం, రైతుల సంక్షేమం అనే అంశంపై  సదస్సులో ఆయన ప్రసంగించారు. తాము ప్రవేశపెట్టిన నేల ఆరోగ్య కార్డు, వేప పూత యూరియా, పీఎంకేఎస్‌వై తదితర పథకాలతో రైతులకు ప్రయోజనాలు సమకూరుతాయన్నారు. గత పథకాల్లోని లోటుపాట్లను గుర్తించి, సవరించి కొత్త పథకాలు తీసుకొచ్చామని  వివరించారు. సిక్కిం  సీఎం చామ్లింగ్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా తమ రాష్ట్రం నిలవడం గర్వకారణమన్నారు. రసాయన ఎరువులు ఏ విధంగా బ్యాన్ చేసింది, సేంద్రియ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహించింది వివరించారు.
Read More
1